రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
కరీంనగర్‌క్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆర్‌అండ్‌బీ, పోలీస్, రవాణా, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్టీసీ, ఇతరశాఖల అధికారులతో రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, గతంలో గుర్తించిన బ్లాక్‌స్పాట్ల నివారణ చర్యలు, గత కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలపై కలెక్టర్ ఆరా తీశారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సైన్‌బోర్డులు ఏర్పా టు చేయాలన్నారు. నేషనల్ హైవే అథారిటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రోడ్డుసేఫ్టీ కమిటీ మీటింగ్‌లో చర్చించిన అంశాలపై చర్యలు తీసుకొని, నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉండాలన్నారు. పాఠశాల బస్సులపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ అతికించాలని సూ చించారు. జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించే జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ కరీంనగర్– జగిత్యాల రోడ్డు కు ఇరువైపులా చెట్లకొమ్మలు ఎక్కువగా ఉన్నందున రాత్రివేళలో దారి కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇబ్బందులను తొలగించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ పాల్గొన్నారు.


