పాలన మురువాలె!
గ్రామాల్లో కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు
సవాలుగా మారనున్న నిధుల లేమి
ఆర్థిక సంఘం నిధులపైనే ఆశలు
సర్కార్ కరుణిస్తేనే పల్లెల్లో అభివృద్ధి
కరీంనగర్: గ్రామాభివృద్ధే ధ్యేయంగా కోటి ఆశలతో కొత్త పంచాయతీ పాలకవర్గాలు సోమవారం కొలువుదీరాయి. ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు నూతనంగా గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో పల్లెల్లో జోష్ పెరిగి పండుగ వాతావరణం నెలకొంది. ఇటీవల మూడు విడతల్లో పంచాయతీలకు ఎన్నికలు పూర్తయిన విషయం తెలిసిందే. జిల్లాలో 318 గ్రామపంచాయతీలకు గాను 315 పంచాయతీలు, 2,946 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. వివిధ కారణాలతో మూడు పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. కొత్త పాలకవర్గాలు కొలువుదీరడంతో 23 నెలల నుంచి కొనసాగిన ప్రత్యేక పాలన ముగిసినట్లయింది. ఇన్నాళ్లు గ్రామాల్లో పత్యేక అధికారుల పాలన కొనసాగడంతో.. ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. దీంతో కార్యదర్శులే అప్పులు చేసి గ్రామాల్లో అత్యవసర పనులు చేపట్టారు. ఇక నుంచి పాలకవర్గాలు పగ్గాలు చేపట్టడంతో పల్లెప్రజలు అభివృద్ధిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు
సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు గ్రామాల్లో నిధుల లేమి సవాలుగా మారనుంది. కొత్తగా గెలుపొంది ఉత్సాహంగా ఏ పనులైనా చేపడతామంటే ఒక్క రూపాయి కూడా లేకపోవడంతో పాలన ఎలా అనే సందేహాలు నెలకొన్నాయి. దీనికి తోడు గ్రామాల్లోని పాత సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గ్రామాల్లో పేరుకుపోయిన పలు సమస్యలు, అప్పుల చిట్టా, పెండింగ్ బిల్లులు చెల్లించడమే వారికి ఇబ్బందిగా మారనుంది. ప్రభుత్వాలు కరుణించి ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తే.. కాస్త ఉపశమనం లభించనుంది. అంతకుముందు 23 నెలలకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు మాత్రమే విడుదలయ్యాయి. నిబంధల ప్రకారం పాలకవర్గాలు ఉంటేనే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్రం నిధులను ఆపేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వలేదు. దీంతో గ్రామ పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. అటు సర్పంచ్‌లు చేసిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా, ఇటు పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వం చేపట్టిన ఏ ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు రాకపోవడంతో వారు అప్పుల పాలయ్యారు.
సర్కార్ నిధులిస్తేనే అభివృద్ధి
పంచాయతీల్లో గత ప్రభుత్వం ప్రతి నెలా కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిపి నిధులు ఇస్తూ వచ్చింది. దీంతో చిన్న పంచాయతికి రూ.50 వేలు, పెద్ద పంచాయతీలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ప్రతి నెలా ఆయా గ్రామాల్లోని జనాభాను బట్టి నిధులు ఇచ్చింది. ఆ నిధులతో పారిశుధ్యం, వీధి లైట్ల మరమ్మతు, తాగునీటికి సంబంధించిన మోటార్ల మరమ్మతు, ట్రాక్టర్ల నిర్వహణ, డీజిల్ వంటి అత్యవసరమైన వాటికి అప్పులు తెచ్చి పనులు చేశారు. చివరకు కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. కొత్త పాలక వర్గాలు కొలువుదీరుతుండడంతో.. పాత బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత వారిపైనే పడనుంది.
పాలన మురువాలె!
పాలన మురువాలె!


