● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్
కొత్తపల్లి(కరీంనగర్): భరోసా కేంద్రం అందిస్తున్న సేవలు భేష్ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్ ప్రశంసించారు. పోలీసుశాఖ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో కొత్తపల్లి శివారులో ఏర్పాటు చేసిన కేంద్రం మొదటి వార్షికోత్సవం సోమవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల నివారణకు, వేధింపులకు గురైన సమయంలో ఆదరణకు భరోసా కేంద్రాలు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, ఏడాది క్రితం ప్రారంభమైన భరోసా కేంద్రం ఎన్నో మైలురాళ్లను దాటిందని, అనేక కేసుల్లో మహిళలు, చిన్నారులకు అండగా నిలిచి బాధితుల్లో ధైర్యం నింపిందన్నారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ, కేంద్రం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 47 పోక్సో, 13 లైంగికదాడి కేసులు నమోదు చేశామని చెప్పారు. బాధితులకు రూ.5 లక్షల ఆర్థికసాయం అందించినట్లు వెల్లడించారు. మహిళలు, 18 ఏళ్లలోపు బాలబాలికలు ఎవరైనా నేరుగా, పోలీస్‌స్టేషన్ ద్వారా భరోసా కేంద్రం సేవలు పొందవచ్చని తెలిపారు. సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీఎంహెచ్‌వో వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


