లోక్ అదాలత్‌లో 3,031కేసులు పరిష్కారం
కరీంనగర్‌క్రైం: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు నిర్వహించిన లోక్ అదాలత్‌లో 3,031 కేసులు పరిష్కరించినట్లు కరీంనగర్ జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ ఎస్.శివకుమార్ తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన లోక్ అదాలత్ ప్రారంభ కార్యక్రమానికి జడ్జి హాజరై మాట్లాడారు. రాజీ ద్వారా తమ కేసులు పరిష్కరించుకుంటే ఇరువురు సంతోషంగా ఉంటారని తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజు మాట్లాడుతూ.. అందరి సహకారంతో లోక్ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారం అవుతున్నాయన్నారు. సీసీఆర్‌బీ ఏసీపీ శ్రీనివాస్‌జీ మాట్లాడుతూ రాజీతో లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కరించుకుంటే డబ్బు, సమయం ఆదా అవుతుదన్నారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి కే.రాణి లోక్ అదాలత్ గురించి వివరించారు. జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 3,031 కేసులు పరిష్కరించారు. వీటిలో సివిల్ కేసులు 85, క్రిమినల్ కేసులు 2,859, ఇతర కేసులు 87 పరిష్కరించారు. వాహన ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.78 లక్షల పరిహారం చెక్కును జిల్లా జడ్జి చేతుల మీదుగా అందించారు.


