ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని..
● ఉరేసుకుని తనువు చాలించిన యువకుడు
ధర్మపురి: ప్రేమించిన అమ్మా యి పెళ్లికి నిరాకరించిందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రామయ్యపల్లెలో జరిగింది. ఎస్సై మహేశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కాల్ల లింగన్న, కరుణ దంపతులకు కుమారుడు నవీన్, ఇద్దరు కూతుళ్లున్నారు. లింగన్న ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్లాడు. నవీన్ కూడా రెండేళ్లపాటు దుబాయి వెళ్లివచ్చి ప్రస్తుతం హైదరాబాద్‌లో పనిచేసుకుంటున్నాడు. కొంతకాలంగా రామయ్యపల్లికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు సమాచారం. ఆమె పెళ్లికి నిరాకరిస్తోందని తరచూ బాధపడుతుండేవాడు. పది రోజుల క్రితం హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చిన నవీన్.. అమ్మాయి వ ద్దకు వెళ్లి పెళ్లి చేసుకుందామని కోరగా ఆమె ని రాకరించింది. దీంతో మనస్తాపానికి గురై శని వారం ఇంట్లోనే ఉరేసుకున్నాడు. కాసేపటికి తల్లి చూడగా నవీన్ (24) వేలాడుతూ కనిపించాడు. కిందకు దింపి జగిత్యాల ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు తనువు చా లించడంతో కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. కుమారుడి మృతి వార్త తెలుసుకున్న లింగన్న దుబాయి నుంచి వస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కరుణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పెళ్లి కావడం లేదని వ్యక్తి..
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం భోజన్నపేట గ్రామానికి చెందిన బండారి నరేశ్ (31) పెళ్లి కావడం లేదన్న బెంగతో మానసిక వేదనకు గురై పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ ఎస్సై మల్లేశ్ కథనం ప్ర కారం.. కొంతకాలంగా నరేశ్‌కు పెళ్లిసంబంధాలు చూసినా కుదరడం లేదు. మానసిక వేదనకు గురై శనివారం క్రిమిసంహారక మందుతాగాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతుడి తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అప్పుల బాధ భరించలేక ఒకరు..
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం దస్తగిరిపల్లి గ్రా మానికి చెందిన నూనెల రవి (37) అప్పుల బాధతో ఆది వారం క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇల్లు కట్టేందుకు చేసిన అప్పు ఎలా తీర్చాలోనని తరచూ మదనపడుతుండేవాడు. అదే వేదనతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని రూరల్ ఎస్సై మల్లేశ్ తెలిపారు. మృతుడి భార్య రమ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
చలిమంట కాగుతూ.. నిప్పంటుకొని వృద్ధురాలు మృతి
గన్నేరువరం చలిమంట కాగుతుండగా.. ప్రమాదవశాత్తు నిప్పంటుకొని మండల కేంద్రానికి చెందిన రామంచ నర్సవ్వ (85) మృతి చెందింది. స్థానికులు, ఎస్సై నరేందర్‌రెడ్డి కథనం ప్రకారం నర్సవ్వ ఇంటి ముందు ఉన్న పొయ్యి వద్ద ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుని ఆదివారం చలిమంట కాగుతోంది. ఈ క్రమంలో మంట వేడికి కుర్చీ విరిగి వృద్ధురాలు మంటలో పడి తీవ్రంగా గాయపడింది. చుట్టూపక్కల వారు గమనించి నర్సవ్వను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందింది. నర్సవ్వ మనమడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు సంతానం. ఇద్దరు కుమారులు అనారోగ్యంతో గతంలోనే మృతిచెందారు.
ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని..


