ఉపాధి.. పల్లె ఊపిరి
కరీంనగర్ అర్బన్: పల్లెలే పట్టుకొమ్మలన్నది మహాత్ముడి మాట. మరీ అ మాటను సర్పంచిలు ఔపోసన పడితే గ్రామీణాభివృద్ధి ఇట్టే సాధ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీలను నిధుల కొరత వెంటాడుతుండటంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడం సవాలే. ఈ క్రమంలో ప్రభుత్వ పథఽకాలను లక్షిత వర్గాలకు చేర్చడమే కాకుండా మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆయుధంగా మలచుకోవాల్సిన తరుణమిది. జిల్లావ్యాప్తంగా ఎన్నికై న సర్పంచిలు సోమవారం బాధ్యతలు చేపట్టనున్నందున కథనం..
స్వచ్ఛత.. నీటి నిల్వ
గ్రామాలను సంపూర్ణ పారిశుధ్య గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఉపాధి పథకంలో నిధులు పుష్కలం. మరుగుదొడ్ల నిర్మాణంలో అవసరమైన గుంతలను కూలీలతో తవ్వించి, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించవచ్చు. సాగు భూముల్లో కాంటూరు కందకాలు, ఊట కుంటలు, ఫాంపాండ్స్, చెక్ డ్యాంలు, రాళ్లకట్టలు తదితర వాటిని ఏర్పాటు చేసుకోవడానికి వీలుంది. ముందుగా ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని పక్కాగా పనులు పూర్తి చేస్తే భూగర్భ జలాలు పెరగనున్నాయి.
సాగుకు ఊతం.. మొక్కలు నాటుదాం
గ్రామాల్లో మొక్కలు నాటి హరిత వనం పెంపొందించేందుకు వీలుంది. పంచాయతీల్లో నర్సరీ అందుబాటులో ఉంది. గుంతలు తవ్వడం మొదలు, మొక్కలను నాటేందుకు, పోషణకు కూడా డబ్బులు ఇస్తున్నారు. గ్రామాల్లో చెరువులు, చెక్ డ్యాంలు, ఊట కుంటలు, ప్రాజెక్టు కాల్వల్లో నుంచి పూడిక తీసుకునేందుకు అవకాశం ఉంది. కూలీలతో పనులు చేయిస్తే అటు వారికి ఉపాధి చూపడంతో పాటు నీటి వనరులను బాగు చేసుకోవచ్చు.
ఉపాధితో బాట
గ్రామం నుంచి ఇతర గ్రామాలకు, పంట పొలాలకు దారులు లేని ప్రాంతాలకు ఉపాధి పథకం కింద దారులు వేసుకోవచ్చు. ఎడ్లబండ్లు, ఇతర వాహనాలు వెళ్లేందుకు వీలవుతుంది. గ్రామంలో పంచాయతీ, అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనం లేకుంటే ఉపాధి హామీ పథకంలో నిర్మించుకునే వీలుంది.
ఎవరిని సంప్రదించాలంటే
ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసేందుకు మండల స్థాయిలో ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారు. జిల్లాలో డిఆర్డీవోతో పాటు ఏపీడీ, మండలాల్లో ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్లు, గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారు. మండల అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో పనుల గుర్తింపు, ఎంపిక, ఆమోదం, మంజూరు ఉంటాయి.
సద్వినియోగం చేసుకుంటే అభివృద్ధి
సర్పంచ్‌లూ దృష్టిసారించండి


