సుపారీ ఇచ్చి కొడుకు హత్య
కరీంనగర్‌క్రైం: ఉపాధి కోసం కొడుకు గల్ఫ్ దేశాలకు వెళ్తే.. కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో వ్యక్తి. కొద్దిరోజులకు కొడుకు ఇంటికి వచ్చి భార్య, తండ్రి మధ్య నడుస్తున్న వ్యవహారంపై మందలించాడు. దీంతో తమ బంధానికి అడ్డుగా ఉన్న కొడుకును చంపించాలని అనుకున్నాడు. ఇందుకు రూ.3లక్షల సుపారీ ఇచ్చి పథకాన్ని అమలు చేశాడు. పోలీసుల విచారణలో నేరం బయటపడగా.. నిందితులను ఆదివారం ఆరెస్టు చూపారు. రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ఇందుకు సంబంధించిన వివరాలను తన కార్యాలయంలో వెల్లడించారు. రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గాదె అంజయ్య(36)కు శిరీషతో 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు ఆడ పిల్ల లున్నారు. అంజయ్య 2017లో విదేశాలకు వెళ్లి 2019లో తిరిగొచ్చాడు. తన తండ్రి గాదె లచ్చయ్య, శిరీష మధ్య సాన్నిహిత్యాన్ని చూసి పలుమార్లు ఇరువురిని మందలించాడు. ఇలా ఐదేళ్లు గడిచిపోయాయి. తమ బంధానికి అడ్డుగా ఉన్న కొడుకును హతమార్చాలని లచ్చయ్య నిర్ణయించుకున్నాడు. అదే గ్రామానికి చెందిన కొలిపాక రవి, ఉప్పరపల్లి కోటేశ్వర్, మహమ్మద్ అబ్రార్లతో రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.1.25 లక్షలు ఇచ్చాడు. అంజయ్యను చంపాలని పథకం వేసిన కోటేశ్వర్, మహమ్మద్ అబ్రార్ అతనితో స్నేహం చేశారు. ఈనెల 2న అతిగా మద్యం తాగించి గొంతునులిమి చంపేశారు. మృతదేహాన్ని సమీపంలోని కెనాల్‌లో పడేశారు. 5వ తేదీన కాలువలో అంజయ్య శవంలభ్యం కాగా.. ప్రమాదవశాత్తు చనిపోయినట్లు నమ్మించేందుకు యత్నించారు. పోలీసులకు దర్యాప్తులో పలు అనుమానాలు రావడంతో లోతుగా విచారించారు. గాదె లచ్చయ్య సుపారీ ఇచ్చి చంపించాడని నిర్ధారణకు వచ్చారు. నిందితులు గాదె లచ్చయ్య, గాదె శిరీష, ఉప్పరపల్లి కోటేశ్వర్, మహమ్మద్ అబ్రార్, కొలిపాక రవిని ఆదివారం అరెస్టు చేశారు. వారినుంచి రూ.40వేల నగదు, బైకు స్వాధీనం చేసుకున్నారు. చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్, రామడుగు ఎస్సై రాజు పాల్గొన్నారు.
కోడలితో మామ వివాహేతర సంబంధం
అడ్డు తొలగించుకునేందుకు పథకం
రూ.3లక్షలు ఇచ్చి కొడుకును చంపించిన తండ్రి
వివరాలు వెల్లడించిన రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్
సుపారీ ఇచ్చి కొడుకు హత్య


