రైతుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా కరీంనగర్ ‘కిసాన్ గ్రామీ
కరీంనగర్: రైతులు, మహిళా సంఘాలు, గ్రామీణ ప్రజల ఆర్థిక ప్రగతిని కాంక్షిస్తూ ‘కిసాన్ జాగరణ్’ ఆధ్వర్యంలో కరీంనగర్ వేదికగా మరోసారి భారీ ఎత్తున శ్రీకిసాన్ గ్రామీణ మేళ్ఙాను నిర్వహిస్తున్నట్లు కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు పి.సుగుణాకర్ రావు తెలిపారు. కార్యక్రమాన్ని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభిస్తారని వెల్లడించారు. కరీంనగర్‌లోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. 2022, 2023లో నిర్వహించిన ప్రదర్శనలకు తెలంగాణలోనే అత్యధిక సంఖ్యలో రైతులు హాజరైన రికార్డు ఉందని, ఈసారి అంతకు మించి వినూత్న కార్యక్రమాలతో మేళాను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ లేదా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే ప్రదర్శనలకు దూర ప్రాంత రైతులు వెళ్లలేకపోతున్నారని, అందుకే రైతు చెంతకే సాంకేతికతను తీసుకురావాలనే ఉద్దేశంతో కరీంనగర్‌ను వేదికగా ఎంచుకున్నట్లు తెలిపారు. ఈ మేళాలో లాభదాయక ప్రత్యామ్నాయ పంటలు, కేవలం వరి సాగుకే పరిమితం కాకుండా.. పామాయిల్, పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం వంటి మార్గాల ద్వారా ఎకరాకు కనీసం లక్ష రూపాయల ఆదాయం ఎలా పొందాలనే అంశంపై రైతులకు దిశానిర్దేశం చేయనున్నామన్నారు. ఎస్సారెస్పీ కెనాల్ పరీవాహక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి వరి పంట దెబ్బతింటున్న పొలాల్లో.. చేపలు, రొయ్యల పెంపకం ద్వారా అధిక లాభాలు గడించే విధానాలను వివరిస్తారని అన్నారు. యూరియా బుకింగ్ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త యాప్ వినియోగం, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు తెచ్చే తేనెటీగల పెంపకం, గీత కార్మికుల కోసం చెట్లు ఎక్కే ఆధునిక పరికరాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ మేళాలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అనుభవజ్ఞులైన ప్రగతిశీల రైతులు పాల్గొని తమ అనుభవాలను పంచుకుంటారని తెలిపారు. రైతులు, మహిళా సంఘాల సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.
ప్రారంభించనున్న హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు పి.సుగుణాకర్ రావు


