అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని వివిధ అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలో కమిషనర్ సుడిగాలి పర్యటన చేశారు. టవర్‌సర్కిల్ సమీపంలో వేసిన బీటీరోడ్డు పనులు తనిఖీ చేశారు. అమరవీరుల స్తూపం వద్ద తాగునీటి సరఫరా పైప్‌లైన్ లీకేజీ మరమ్మతు పనులు పరిశీలించారు. పైప్‌లైన్ లీకేజీని త్వరగా అరికట్టాలని ఆదేశించారు. అశోక్‌నగర్‌లో రోడ్డు పనులు, మదీనా కాంప్లెక్స్‌లోని ఐడీఎస్‌ఎంటీ భవన ఆధునీకరణ పనులను, మానేరుడ్యాం సమీపంలోని వాకింగ్ ట్రాక్‌ను పరిశీలించారు. అమరవీరులస్తూపం సమీపంలో చేపట్టిన తాగునీటి పైప్‌లైన్ మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేసి లీకేజీని అరికట్టాలన్నారు. 30ఏళ్ల క్రితం వేసిన తాగునీటి ౖపైప్‌లైన్ కాబట్టి తరుచుగా లీకేజీలు సంభవిస్తే, శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఐడీఎస్‌ఎంటీ భవన ఆధునీకరణ పనులు జనవరి 1వ తేదీలోగా పూర్తిచేసేలా పనులు వేగవంతం చేయాలన్నారు. సప్తగిరికాలనీలో అర్బన్ హెల్త్ సెంటర్ కోసం స్థల పరిశీలన చేసి, భవన నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరపాలకసంస్థ ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఈఈ సంజీవ్‌కుమార్, డీఈ వెంకటేశ్వర్లు, మాజీ డిప్యూటీ మేయర్ జి.రమేశ్ పాల్గొన్నారు.
స్మార్ట్‌సిటీ పనులు త్వరగా పూర్తి చేయాలి
నిర్ణీత వ్యవధిలో స్మార్ట్‌సిటీ పనులు పూర్తిచేసి, జీఎంఐ పోర్టల్‌లో నమోదు చేయాలని స్మార్ట్‌సిటీ ఉన్నతాధికారులు ఆదేశించారు. స్మార్ట్‌సిటీ మిషన్ కింద చేపట్టిన అభివృద్ధి పనులపై భారత ప్రభుత్వ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖకు చెందిన జాయింట్ సెక్రటరీ, స్మార్ట్ సిటీ మిషన్ నేషనల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో వర్చువల్ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ నుంచి నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. పనులు త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు.


