ప్రజాక్షేత్రంలో పనిచేయండి
చిగురుమామిడి: సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందిన సీపీఐ శ్రేణులు, అధైర్యపడకుండా ప్రజాక్షేత్రంలో సమస్యలపై పోరాడాలని పార్టీ సీనియర్ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. చిగురుమామిడిలోని ముస్కురాజిరెడ్డి స్మారకభవనంలో శుక్రవారం పార్టీ మండలస్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశం ముల్కనూర్ ఉపసర్పంచ్ పైడిపల్లి వెంకటేశ్ అధ్యక్షతన జరిగింది. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల ఫలితాలు పార్టీకి కొంత నిరాశ కలిగించినప్పటికీ.. రెట్టింపు ఉత్సాహంతో ప్రజల పక్షాన పోరాటం చేయాలన్నారు. బీజేపీ ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజివేకా మిషన్ గ్రామీణ పేరిట మహాత్మాగాంధీని అవమానపరుస్తోందని, ఇందుకు నిరసనగా ఈనెల 22న అన్నిజిల్లాలు, మండలాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చి నట్లు తెలిపారు. పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అందెస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కౌన్సిల్ సభ్యులు బోయిని పటేల్, చాడ శ్రీధర్‌రెడ్డి, బూడిద సదాశివ, తేరాల సత్యనారాయణ, జాగిరి సత్యనారాయణ పాల్గొన్నారు.


