● ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుపై దృష్టి ● విద్యాశాఖ సమాయత్తం
జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 425
ప్రాథమికోన్నత పాఠశాలలు 75
ఉన్నత పాఠశాలలు 150
మొత్తం పాఠశాలలు 650
మొత్తం విద్యార్థులు 42,322
కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా ఈనెల 6నుంచి 19వ తేదీ వరకు ‘బడిబాట’ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు డీఈవో శ్రీరామ్ మొండయ్య వెల్లడించారు. ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం పేరిట జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధం చేసి ఇది వరకే కలెక్టర్ పమేలా సత్పతి నేతృత్వంలో సమావేశాలు నిర్వహించారు.
జిల్లా యంత్రాంగం సన్నద్ధం
కలెక్టర్ నేతృత్వంలో డీఈవో, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో జిల్లాస్థాయిలో కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై, కెపాసిటీ బిల్డింగ్ పేరిట జిల్లాలోని వివిధ కేటగిరీల ఉపాధ్యాయులకు ఇటీవల మూడు దఫాలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాలల ప్రారంభం లోపు ఉచిత దుస్తులు, పుస్తకాలు అందించడంతో పాటు విద్యార్థుల నమోదును పెంచేందుకు కలెక్టర్ క్షేత్రస్థాయిలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. సామాజిక సేవాసంస్థలు, ఎన్జీవోలు తదితర వర్గాలను సమన్వయపరిచి బడిబాటను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు.
మండలస్థాయిలో
మండల పరిషత్ అధికారులు, ఎస్సైలు, ఇతర వర్గాల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఏ రోజు ఏం చేయాలనే కార్యాచరణను ఎంఈవో రూపొందిస్తారు. గ్రామస్థాయిలో కమిటీలు, బడిబాటపై అవగాహన, ప్రచార కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్వహిస్తారు. స్థానిక నేతల భాగస్వామ్యంతో బడిబాటలో గుర్తించిన విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ చేపడతారు.
షెడ్యూల్ ఇదీ..
● జూన్ 6న ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులతో గ్రామసభ
● 07న ఉపాధ్యాయుల ఇంటింటి సందర్శన, బడీడు పిల్లలను గుర్తించడం
● 08,09,10న కరపత్రాలతో ఇంటింటి ప్రచారం, అంగన్‌వాడీ కేంద్రాల సందర్శన. బడిమానేసిన పిల్లలను గుర్తించి చేర్పించడం. ప్రత్యేకావసరాల పిల్లలను భవితకేంద్రాల్లో చేర్పించడం
● 11న నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష
● 12న అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించడం. పిల్లలకు పాఠ్య, రాత పుస్తకాల పంపిణీ, ఉచిత దుస్తుల అందజేత
● 13న సామూహిక అక్షరాభ్యాసం, బాలసభ
● 16న తొలిమెట్టు, ఉన్నతి కార్యక్రమాల దినోత్స వం. తరగతి గదుల్లో విషయాల వారీగా అభ్యసనా సామర్థ్యాల గోడప్రతుల ప్రదర్శన. పిల్లలు రూపొందించిన చార్టులతో గదుల అలంకరణ. చదవడం, గణిత సంబంధిత వాటిపై క్విజ్ పోటీలు
● 17న సమీకృత విద్య, బాలికా విద్యా దినోత్సవం నిర్వహణ. బాలికా వివాహాలు, చిన్నారులపై వేధింపులను అరికట్టేందుకు ప్రతిజ్ఞ
● 18న తల్లిదండ్రులు, పోషకులు, గ్రామస్తులు, వార్డు సభ్యులను ఆహ్వానించి తరగతి గదుల్లో చేపట్టిన డిజిటలీకరణ, సౌకర్యాలు చూపించడం, మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని పిల్లలకు వివరించడం
● 19న బడిబాట ముగింపు సందర్భంగా పిల్లలకు క్విజ్ పోటీలు
విజయవంతం చేస్తాం
కలెక్టర్ ఆధ్వర్యంలో అన్నిశాఖలు, అన్నివర్గాల ప్రజల సమ న్వయంతో బడిబాటను విజ యవంతం చేసేందుకు కృషి చేస్తాం. ప్రణాళికను పాటిస్తూ, ఎక్కువ మంది పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా పనిచేస్తాం. బడిబాటను విజయవంతం చేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం.
– శ్రీరామ్ మొండయ్య, డీఈవో
రేపటి నుంచి బడిబాట


