చొక్కారావు సన్నిహితుడు ‘నరెడ్ల’
● అతడిని ఎప్పటికీ మరువలేను ● శ్రీనివాస్ విగ్రహావిష్కరణలో మంత్రి పొన్నం ప్రభాకర్
విద్యానగర్(కరీంనగర్): తన రాజకీయ గురువు స్వర్గీయ జువ్వాడి చొక్కారావును, అతడికి అత్యంత సన్నిహితుడు నరెడ్ల శ్రీనివాస్‌ను ఎప్పటికీ మరువలేనని బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ ఫిలిం సొసైటీ ఆవరణలో ఏర్పాటు చేసిన సామాజిక, లోక్‌సత్తా ఉద్యమ నాయకుడు నరెడ్ల శ్రీనివాస్ విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వినియోగదారుల మండలి, సమాచార హక్కుదారుడిగా పోరాటాలు చేసి, బాధితులకు న్యాయం చేకూర్చిన వ్యక్తి శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ ఫిలిం సొసైటీలో కీలక సభ్యుడిగా ప్రయోజనాత్మకమైన చిత్రాలను ప్రదర్శించడం ద్వారా ప్రజలను చైతన్య పరిచారన్నారు. ఫిలింసొసైటీకి అనువుగా ఉండే స్థల సేకరణకు కలెక్టర్ అనుకూలంగా ఉన్నారని, స్థల సేకరణ పూర్తయిన తరువాత భవన నిర్మాణానికి నిధులు ఇప్పించే బాధ్యత తనదే అన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, గురుకుల పాఠశాలల జాయింట్ సెక్రటరీ జీవీ.శ్యాంప్రసాద్‌లాల్, కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర, వరాల మహేశ్, ప్రకాశ్ హోల్లా, రామచంద్రారెడ్డి, ముజఫర్, అన్నవరం దేవేందర్, రఘురాం పాల్గొన్నారు.
కవిత లేఖపై కేసీఆర్ స్పందించాలి
కరీంనగర్ కార్పొరేషన్: బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత రాసిన లేఖపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు స్పందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనని తాము మొదటి నుంచి చేస్తున్న ఆరో పణలకు కవిత లేఖలో రాసిన అంశాలు నిజమని తేల్చాయన్నారు. కరీంనగర్‌లో శుక్రవారం మాట్లాడుతూ కవిత రాసిన లేఖపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావు ఎందుకు మాట్లాడం లేదని ప్రశ్నించారు. సాక్షాత్తు బీఆర్‌ఎస్ అధ్యక్షుడి కూతురే పార్టీ అధినేత కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్నారని తెలిపారు. కేసీఆర్ ప్రతిపాదన మేరకే బండి సంజయ్‌ని తప్పించి కిషన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టినట్లు ప్రచారంలో ఉందన్నారు. కవిత కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారనేది అపోహ మాత్రమేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను బాంబులతో పేల్చేశారని, కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలని, నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్‌రెడ్డి పేరుందని కవిత లేఖ నుంచి డైవర్షన్ చేసేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నాడన్నారు. కాళేశ్వరం బాంబులు కాదని, కవిత పేల్చిన బాంబుల గురించి కేటీఆర్ మాట్లాడాలని పొన్నం చమత్కరించారు. కరీంనగర్‌లో శాతవాహన యూనివర్సిటీకి లా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల తీసుకువచ్చామని ఆయన తెలిపారు. డంప్‌యార్డ్‌ను తొలగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.


