బడి వంట.. ధరల మంట
అప్పులే మిగులుతున్నాయి
కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలి
జిల్లాలో పాఠశాలలు.. విద్యార్థుల వివరాలు
కరీంనగర్‌టౌన్: కూరగాయల ధరలు కుతకుతలాడుతుండగా.. కోడిగుడ్డు కొండెక్కింది. పెరిగిన కూరగాయల ధరలతో సామాన్యులు సతమతం అవుతుండగా.. ప్రభుత్వ పాఠశాలలో వందలాది మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండిపెట్టే నిర్వాహకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వచ్చే బిల్లులు సరుకులకు సరిపోక.. ఇచ్చే వేతనాలతో ఇల్లు గడవక, పెరుగుతున్న ధరలతో అప్పు చేసి మరీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నామని వాపోతున్నారు.
జిల్లాలో 607 పాఠశాలలు
జిల్లాలో 607 పాఠశాలలు ఉన్నాయి. 36,127 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం స్వీకరిస్తున్నా రు. 8వ తరగతి వరకు కేంద్ర ప్రభుత్వం, 9,10 తరగతుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి మధ్యాహ్న భోజనం అందిస్తున్నాయి. 1 నుంచి 5వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.6.78, 6 నుంచి 10వ తరగతి వరకు రూ.10.17 చొప్పున మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు అందిస్తున్నారు. రూ.3000 చొప్పు న గౌరవ వేతనం ఇస్తున్నారు. కేంద్రం నుంచి అక్టోబర్, నవంబర్ బిల్లులు, వేతనాలు, రాష్ట్రం నుంచి జూలై నుంచి నవంబర్ బిల్లులు రావాల్సి ఉంది. 4నెలల కోడిగుడ్ల బిల్లులు బకాయి ఉన్నాయి.
80శాతం కోడిగుడ్డుకే
వారంలో మూడు రోజులు కోడిగుడ్డు పెట్టాలనేది నిబంధన. ప్రస్తుతం మార్కెట్లో కోడిగుడ్డు ధర రూ.7.30 నుంచి రూ.8వరకు పలుకుతోంది. ప్రతి విద్యార్థికి అందిస్తున్న రూ.10.17లో 80శాతం కోడిగుడ్డుకే వెచ్చించాల్సి వస్తోంది. మిగిలిన డబ్బులతోనే పప్పుచారు లేదా కూర వండాలి. పెరిగిన ధరలతో మెనూ ప్రకారం ఎలా వడ్డించేదని నిర్వాహకులు వాపోతున్నారు.
అప్పుల కుప్పలు..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే. ఏజెన్సీలకు సరైన వేతనాలు ఇవ్వకపోగా, బిల్లులు కూడా మంజూరు చేయకపోవడంతో మధ్యాహ్న నిర్వాహకులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. రూ.3000 గౌరవ వేతనం కూడా సరిగ్గా అందడం లేదని అంటున్నారు. పెరిగిన ధరలతో మెనూ ఎలా అమలు చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై మండల నోడల్ అధికారులు, విద్యాశాఖ ఉన్నత అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.
పాఠశాలలు సంఖ్య విద్యార్థులు
ప్రాథమిక 387 12,593
ప్రాథమికోన్నత 63 2,034
ఉన్నత 157 21,500
మొత్తం 607 36,127
25 ఏళ్లుగా మధ్యాహ్న భోజన నిర్వాహకురాలిగా పనిచేస్తున్న. గౌరవ వేతనం రూ.3వేలు ఇవ్వడం బాధాకరం. పెరిగిన ధరలతో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలంటే అప్పుల పాలవుతున్నాం. బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నాం. ప్రస్తుతం గుడ్డుకే రూ.7.50 పెట్టి వారంలో మూడు రోజులు పెడుతున్నాం. ఏనాటికై నా ఉద్యోగం ఉంటుందనే భరోసాతో పనిచేస్తున్నాం. ప్రభుత్వం గుర్తించాలి. – బుర్ర మంజుల, మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా అధ్యక్షురాలు
మధ్యాహ్న భోజన నిర్వాహకులకు హైకోర్టు ఉత్వర్వుల ప్రకారం కనీస వేతనం రూ.17వేలు చెల్లించాలి. సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఇంతకు ముందు విద్యార్థులకు ఇచ్చిన రేటు ఇస్తే గిట్టుబాటు కాదు. చేసిన కూలీ మాపైనే భారం పడుతోంది. ప్రస్తుతం అప్పుతెచ్చి విద్యార్థులకు వండి పెడుతున్నాం. – డి.బాబాయి, మధ్యాహ్న భోజన
వంట కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
బడి వంట.. ధరల మంట
బడి వంట.. ధరల మంట


