నీటి సంఘం కోసం నిరీక్షణ
2008తో ముగిసిన సభ్యుల పదవీకాలం
అప్పటి నుంచి నీటి సంఘాల ఎన్నికల్లేవ్
అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వహిస్తామన్న కాంగ్రెస్
ఇప్పటికీ లేని స్పష్టత.. కరువైన చెరువుల పర్యవేక్షణ
వీణవంక: చెరువుల అభివృద్ధి, నిర్వహణ, పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన నీటి సంఘాల ఎన్నికలు ఏళ్లకాలంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. పాలకవర్గం లేకపోవడంతో చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. 2006లో ప్రధాన చెరువుల పరిధిలో నీటి సంఘం ఎన్నికలు నిర్వహించారు. చైర్మన్‌తో పాటు డైరెక్టర్లు ఉండగా వీరి పదవీకాలం 2008లో ముగిసింది. ఇందులో రైతులే చైర్మన్లుగా వ్యవహరించారు. చెరువుల పర్యవేక్షణ పకడ్బందీగా సాగింది. అప్పటి నుంచి ఎన్నికలు నిర్వహించడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నీటి సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పినప్పటికీ.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంద ఎకరాల ఆయకట్టు పైన ఉన్న చెరువులకు నీటి సంఘం ఎన్నికలు నిర్వహించేవారు. సంఘం బాధ్యులు చెరువులు కబ్జాకు గురికాకుండా చూసేవారు. జిల్లాలో వంద ఎకరాల ఆయకట్టు పైన ఉన్న చెరువులు జిల్లావ్యాప్తంగా 150 వరకు ఉన్నాయి. వీటి పరిధిలో 1.10లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు నీరు అందుతోంది.
ఎదురుచూపులేనా?
నీటి సంఘాలకు నోటిఫికేషన్ ఇచ్చి చైర్మన్, డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించేవారు. ఆయా చెరువుల కింద సాగుచేసే రైతులు ఓటుహక్కు ద్వారా పాలకవర్గాన్ని ఎన్నుకుంటారు. ఎన్నికై న పాలకవర్గం ఆయా గ్రామాల పరిధిలోని చెరువుల అభివృద్ధి, పర్యవేక్షణ, చివరి ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకుంటారు. రైతులను సమన్వయ పరుస్తారు. చెరువు ఆక్రమణకు గురైతే పాలకవర్గం చర్యలు తీసుకుంటుంది. 2008 నుంచి ఇప్పటి వరకు పాలకవర్గం లేకపోవడంతో చోట్ల చెరువులు ఆక్రమణకు గురయ్యాయనే ఫిర్యాదులు జిల్లా కార్యాలయాలకు అందుతున్నాయి.
సంఘాలతో చెరువుల అభివృద్ధి
గత పభుత్వం చెరువుల పూడికతీత, అభివృద్ధికి ప్రతిష్టాత్మకంగా ‘మిషన్‌కాకతీయ’ పనులను చేపట్టింది. ఏళ్లుగా పేరుకుపోయిన పూడికను తొలగించారు. చెరువుల లోతు పెరిగింది. నీటి లభ్యతతో పాటు మత్స్యకారులకు చేపల పెంపకం ద్వారా ఉపాధి పెరిగింది. నీటి సంఘం పాలకవర్గం లేకపోవడంతో జిల్లాలోని చాలా గ్రామాల్లో చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. ఇటీవల సర్పంచ్ ఎన్నికలు పూర్తి కావడంతో నీటి సంఘాల ఎన్నికలు ఉంటాయని రైతుల్లో చర్చ జరుగుతోంది. పాలకవర్గం ఏర్పడితే చెరువుల పర్యవేక్షణ, అభివృద్ధి జరుగుతుందని విశ్వసిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు.
గతంలో నీటి సంఘాల సభ్యులు చెరువుల అభివృద్ధిని చూసుకునేవారు. చెరువు నీటిని పొదుపుగా వాడుకునే విధంగా ఏర్పాట్లు ఉండేవి. ఎన్నికలు నిర్వహించకపోవడంతో చెరువులు అక్రమణలకు గురవుతున్నాయి. చెరువుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. నీటి సంఘం ఎన్నికలు ప్రభుత్వం త్వరగా నిర్వహించాలి.
– నాగిడి సంజీవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు, ఘన్ముక్కుల


