భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ 14వ డివిజన్ ఎల్కలపల్లి గేట్ గ్రామానికి చెందిన వివాహిత కట్ల మమత(28) భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన నెత్టేట్ల లక్ష్మయ్యకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె మమతను ఎల్కలపల్లి గెట్ గ్రామానికి చెందిన కట్ల గణేశ్‌కు ఇచ్చి 2017లో వివాహం జరిపించారు. అయితే, కొద్దిరోజుల క్రితం గణేశ్.. తన భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. మానసికంగా వేధిస్తున్నాడు. భరించలేని మమత మంగళవారం ఇంట్లో క్రిమిసంహారకమందు తాగింది. ఫోన్‌ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందించిది. వారు అత్తారింటికి చేరుకొని మమతను గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎంకు తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. మమతకు కృతిక(6), మనస్వి(4), కార్తికేయ(8 నెలల) బాబు ఉన్నారు. మృతురాలి తండ్రి నెత్టేట్ల్ల లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్ కిరణ్ కేసు నమోదు చేసుకున్నారు.
చెట్టుకు బైక్ ఢీకొని ఒకరి మృతి
రామడుగు: రామడుగు మండలం వెదిర గ్రామ పరిధిలోని రాజాజీనగర్‌కు చెందిన కుమ్మరి రాజు(28) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. కుమ్మరి రాజు గురువారం సాయంత్రం ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై పనినిమిత్తం వెదిర వైపు వస్తున్నాడు. వెదిర– రామడుగు దారిలో బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయాడు. రాజుకు భార్య, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తేలుకాటుకు
ప్రైవేట్ వైద్యమే దిక్కు
ఇల్లంతకుంట(మానకొండూర్): తేలు కుట్టిందని ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే తాళం వేసి ఉండడంతో ప్రైవేట్ వైద్యం చేయించుకున్నట్లు బాధితుడు వాపోయాడు. బాధితుడు తెలిపిన వివరాలు. మండలంలోని నర్సక్కపేటకు చెందిన దూది సుధీర్‌రెడ్డి గురువారం తన మక్క చేనులో పనులు చేస్తుండగా తేలు కుట్టింది. వైద్యం కోసం ఇల్లంతకుంట పీహెచ్‌సీకి వెళ్లాడు. ఆస్పత్రి పల్లె దవాఖానాకు మారిందని బోర్డు చూసి అక్కడికి వెళ్లాడు. అప్పుడు సాయంత్రం 4.10గంటల సమయం కావడంతో ఆస్పత్రికి తాళం వేసి ఉండడంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నట్లు తెలిపాడు. దీనిపై వైద్యాధికారిణి వివరణ కోరగా.. పల్లె దవాఖానాలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకే వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆతర్వాత వైద్యసేవలకు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి వెళ్లాలన్నారు.
కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయం
● ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం
కరీంనగర్: అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేలకోట్ల రూపాయలు సంపాదించిన కేసీఆర్, కేటీఆర్, కవిత ఆస్తులపై విచారణ జరుగుతోందని.. వారు జైలుకు వెళ్లడం ఖాయమని ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం ధరణి పేరుతో వేల కోట్ల రూపాయల భూములు కాజేసి, బినామీ పేర్ల మీద అమ్ముకుందని ఆరోపించారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసి, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేస్తోందన్నారు. కేసీఆర్, కేటీఆర్, బండి సంజయ్ కలిసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్ అమలు చేయించాలని డిమాండ్ చేశారు. హెచ్‌సీయూ భూముల విషయంలో కేసీఆర్, కేటీఆర్ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. గజ్జెల ఆనందరావు, సముద్రాల అజయ్, సుద్దాల లక్ష్మణ్, అనిల్, ప్రభాకర్, శంకర్, స్వరూప, లత, రాజయ్య పాల్గొన్నారు.
భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య
భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య
భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య


