
చామనపల్లిలో కార్యకర్తల ర్యాలీ
కరీంనగర్/కరీంనగర్ రూరల్: కరీంనగర్ ప్రజల ఆశీర్వాదం, సీఎం కేసీఆర్ సహకారంతో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా పదేళ్లలో రూ.వేల కోట్లతో అభివృద్ధి చేశానని, అభివృద్ధిని చూసి మరోమారు ఆశీర్వదించాలని కరీంనగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ కోరారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని 41, 43 డివిజన్ల పరిధిలోని వావిలాలపల్లి, సవరన్ స్ట్రీట్‌లలో నగర మేయర్ యాదగిరి సునీల్‌రావుతో కలిసి గంగుల కమలాకర్ ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కలలు కంటున్న స్కామ్‌ల కాంగ్రెస్ పార్టీని సాగనంపాలని, అబద్ధాల బీజేపీని అటకెక్కించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అమ్మకం, బీఆర్‌ఎస్ అంటే నమ్మకమని, కాంగ్రెస్ గ్యారంటీలు బూటకమని, బీఆర్‌ఎస్ మేనిఫెస్టో ప్రజలకు శ్రీరామరక్ష అని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తూ ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశానన్నారు. మట్టి రోడ్డు అనేది లేకుండా బీటీ, సీసీ రోడ్లను వేశానని అన్నారు. ప్రతి ఇంటికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్న కేసీఆర్‌ను ఆశీర్వదించాలని కోరారు. మూడుసార్లు కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిపించారని, నాల్గోవసారి కూడా తనకు ఓటేసి గెలిపించాలని కోరారు. గ్యారంటీ లేని ఆరు గ్యారంటీలతో వస్తున్న కాంగ్రెస్‌ను నమ్మితే చీకటి రోజులు వస్తాయని, ప్రజలు ఆలోచించి ఓటేయాలని అన్నారు. అధికారంలోకి రాకముందే టికెట్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్ నాయకులు.. రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటారని దుయ్యబట్టారు. ప్రతి కుటుంబానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని.. మరోసారి బీఆర్‌ఎస్ పార్టీని గెలిపిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే సౌభాగ్యలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ప్రతినెలా రూ.3వేలు అందిస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి రూ.5లక్షల బీమాతో పాటు సన్న బియ్యం ఇస్తామని అన్నారు. రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బండారి వేణు, సరిళ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం మద్దతు
బీఆర్‌ఎస్ కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్‌కు బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి వెల్లడించారు. గురువారం మీసేవ కార్యాలయంలో గంగులను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. రమేశ్, అశ్విన్, అజయ్, ఆంజనేయులు, శ్రీనివాస్, మధుబాబు, రమేశ్, ప్రసాద్, కుమార్, మహేశ్, రాజు, చరణ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
సమైక్య పాలనలో దోపిడీ
సమైక్య పాలనలో దోపిడీకి గురై నల్లబడ్డ తెలంగాణ ముఖం స్వరాష్ట్రంలో తెల్ల ముఖంగా మారిందని గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ మండలం చామనపల్లి, బహుదూర్‌ఖాన్‌పేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. మహిళలు మంగళ హారతులు పట్టి డప్పుచప్పుళ్లతో స్వాగతం పలికారు. 2009లో ఎన్నికల్లో చొప్పదండి నుంచి కరీంనగర్ నియోజకవర్గంలో చేరిన చామనపల్లికి వచ్చేందుకు సరైన రోడ్లు లేవన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి రోడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించామని అన్నారు. పదేళ్ల స్వయం పాలనలో పల్లెలన్ని అభివృద్ధి చెందాయని, కాళేశ్వరం నీళ్లతో సస్యశ్యామలంగా మారినట్లు చెప్పారు. పచ్చని తెలంగాణను దోచుకునేందుకు ఆంధ్రోళ్లు మళ్లీ వస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ను ఓడించి తెలంగాణ సంపదను దోచుకెళ్లాలని చూస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి, పవన్‌కళ్యాణ్, షర్మిల, కేవీపీ, కేఏ పాల్‌కు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ అమ్ముకుంటే భూకబ్జాదారుడు రూ.5కోట్లకు కొన్నాడని, 30కి పైగా కేసులున్న రౌడీ షీటర్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఆయనను గెలిపిస్తే మన భూములు కబ్జా చేస్తాడని, మనల్ని బతకనివ్వడని అన్నారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచాకా ఎప్పుడైనా మీ ఊరికొచ్చి మీ కష్టాలను పట్టించుకున్నాడా అని ప్రశ్నించారు. ఎంపీగా గెలిపిస్తే ఒక్క రూపాయి తేలేదని, తాను మాత్రం మీ బిడ్డగా అందుబాటులో ఉండి అభివృద్ధి చేశానని చెప్పారు. మీ బిడ్డల భవిష్యత్తును ఆలోచించి మరోసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ టి.లక్ష్మయ్య, సర్పంచులు బి.లక్ష్మిఐలయ్య, టి.భూమయ్య, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పి.శ్యాంసుందర్‌రెడ్డి, నాయకులు జి.శ్రీనివాస్, లింగయ్య, రంగారెడ్డి, సాయికృష్ణ, సుధాకర్, రాజేశ్వర్‌రావు, పి.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
అబద్ధాల బీజేపీని అటకెక్కించండి
అభివృద్ధిని చూడండి..
మరోసారి ఆశీర్వదించండి
ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్

43వ డివిజన్‌లో మంత్రి గంగుల కమలాకర్‌కు స్వాగతం పలుకుతున్న మహిళలు
Comments
Please login to add a commentAdd a comment