‘సైబర్‌ నేరగాళ్ల’ ఉచ్చులో ఏఎస్సై | - | Sakshi
Sakshi News home page

‘సైబర్‌ నేరగాళ్ల’ ఉచ్చులో ఏఎస్సై

Mar 15 2026 1:25 AM | Updated on Mar 15 2026 1:25 AM

ఆలస్యంగా వెలుగులోకి...

కేసు నమోదు

జగిత్యాలక్రైం: సైబర్‌ నేరగాళ్లు ప్రముఖులు, సామాన్యులు, చివరికి పోలీసు శాఖ అధికారులనూ వదలడం లేదు. ఇటీవల ఓ ఏఎస్సైని బ్లాక్‌మెయిల్‌ చేసి అతడి నుంచి రూ.95,500 తమ బ్యాంకు ఖాతాలో వేసుకున్నారు. జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్సైకి ఇటీవల ఓ వీడియోకాల్‌ వచ్చింది. తాను మాట్లాడిన వీడియోను రికార్డు చేసిన సైబర్‌ నేరగాళ్లు.. కొద్దిసేపటికే మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పెడతామని ఏఎస్సైని బెదిరించారు. దీంతో భయపడిన సదరు ఏఎస్సై మూడు విడుతలుగా రూ.95,500 సైబర్‌ నేరగాళ్ల ఖాతాలో జమచేశాడు. చివరికి మోసపోయానని తెలుసుకుని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రైలు నుంచి పడి.. గాయాలపాలై

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి సమీపంలోని రాఘవాపూర్‌ రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫాం వద్ద గుర్తుతెలియని వ్యక్తి ఏదో రైలు నుంచి కిందపడి గాయపడినట్లు రామగుండం రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ తిరుపతి తెలిపారు. తలకు తీవ్రగాయమైనట్టు గుర్తించి వెంటనే 108లో పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత కరీంనగర్‌కు తరలించినట్టు పేర్కొన్నారు. బ్లూబ్లాక్‌ డిజైన్‌ హాఫ్‌ టీషర్ట్‌, బ్లాక్‌ ప్యాంటు ధరించి ఉన్నాడని, ఎలాంటి గుర్తింపు కార్డులు లేనందున ఆచూకీ తెలియరాలేదన్నారు. వివరాలు తెలిసిన వారు 99493 04574, 87126 58604 నంబర్లలో సమాచారం అందించాలని కోరారు.

హామీలు నెరవేర్చేదాకా ఉద్యమం

హుజూరాబాద్‌: రైతులకు కాంగ్రెస్‌ ప్రభుత్వమిచ్చిన హామీలను నెరవేర్చేదాకా రైతుల తరఫున ఉద్యమిస్తామని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. శనివారం పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద రైతు ప్రజాసంఘాల సమాఖ్య ఉమ్మడి జిల్లా నాయకుడు మచ్చాచ సమ్మిరెడ్డి రైతుల సంక్షేమ నిరాహార దీక్ష శిబిరాన్ని నిర్వహించగా.. ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులను నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రైతు భరోసా నిధుల కోసం సమీకరించిన రూ.9వేల కోట్ల నిధులను పక్కనబెట్టి కమీషన్లకు కక్కుర్తి పడి కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోగా వెంటనే నిధులు విడుదల చేయాలని, లేకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు. ఏప్రిల్‌ 28న ఓసీ ఐకాస, రైతు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో లక్ష మందితో రైతు మహా గర్జన సమరభేరి సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎడ్ల బండ్లతో మహిళల కోలాట నృత్యాల మధ్య నాయకులు దీక్ష శిబిరానికి చేరుకున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, నాయకులు గూడురి స్వామిరెడ్డి, చందుపట్ల నరసింహారెడ్డి, కిషన్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, పెండాల్యల రాంరెడ్డి, సాంది తిరుపతిరెడ్డి, అయిత నాగరాజు, రావుల భాస్కర్‌, కాశిరెడ్డి మహేందర్‌రెడ్డి, ఏనుగు చొక్కారెడ్డి రాజన్న, కుమారస్వామి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement