కరీంనగర్‌టౌన్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు ఒక గ్రామం నుంచి మరో గ్రామంలో ఉండే ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం రవాణా భత్యం అందిస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 1,776 మందికి ఈ పథకం కింద రాష్ట్ర పాఠశాల డైరెక్టర్ రూ.42.62 లక్షలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ మొదటి వారంలోగా విద్యార్థులకు రవాణా భత్యం అందించనున్నారు.
వచ్చే ఏడాది 9,10 విద్యార్థులకు వర్తింపు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం రవాణా భత్యం అందించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. ఇది వరకు 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు మాత్రమే రవాణా భత్యాన్ని వర్తింపజేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యాహక్కు చట్టం ప్రకారం
విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థి ఇంటికి ప్రాథమిక పాఠశాల కిలోమీటరు దూరం, ప్రాథమికోన్నత పాఠశాల 3 కి.మీ, ఉన్నత పాఠశాల 7 కి.మీ దూరంలో ఉంటే రవాణా భత్యం వర్తింపజేస్తారు. వీరు ఆటోలు, తదితర ప్రైవేటు వాహనాల్లో విద్యాలయాలకు వచ్చి వెళ్లేందుకు ఈ భత్యాన్ని చెల్లిస్తారు. ఒకటి నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికి నెలకు రూ.600 చొప్పున పది నెలలపాటు రూ.6 వేలు, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు సైతం ఇదే విధంగా వర్తింపజేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ డబ్బు విద్యార్థుల వ్యక్తిగత ఖాతాల్లో జమవుతుంది. ఈ మేరకు విద్యార్థి పూర్తి వివరాలు, బ్యాంకు ఖాతా సంఖ్య సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు మండలి ఉన్నతాధికారులకు నివేదించారు. రవాణా భత్యం మంజూరు కావడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులలో హర్షం వ్యక్తమవుతోంది.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త
ఉమ్మడి జిల్లాలో 1,776 మందికి రూ.42.62 లక్షలు మంజూరు
జిల్లాల వారీగా రవాణా మంజూరు ఇలా
జిల్లా విద్యార్థులు నిధులు(రూ.లు)
కరీంనగర్ 431 10,34,400
జగిత్యాల 272 6,52,800
పెద్దపల్లి 622 14,92,800
రాజన్నసిరిసిల్ల 451 10,82,400


