జ్యోతినగర్(రామగుండం): రామగుండం కార్పొరేషన్ పరిధిలో కొంతమంది పేదల స్థలాలను కబ్జా చేసుకుని పెద్ద భవంతులు నిర్మించుకుంటున్నారు. 1వ డివిజన్ ఇందిరమ్మకాలనీలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుంది. స్థలాల ఆక్రమణపై గతంలో ఫిర్యాదులు వెళ్లిన క్రమంలో రెవెన్యూ అధికారులు తూతూ మంత్రంగా సర్వే చేపట్టి మధ్యలోనే వదిలేశారు.
దళారుల గుప్పిట్లో పేదల భూములు
పేదలు నివసించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం ధనవంతుల చేతుల్లోకి వెళ్లడంతో అర్హులకు అన్యాయం జరుగుతోంది. ఇందిరమ్మకాలనీలో 2008 నుంచి ఇప్పటివరకు అధికారికంగా 6,365 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు సమాచారం. చాలా మంది పేదలు ఇంటిని నిర్మించుకోవడానికి డబ్బులు లేక నిర్మాణాలు చేపట్టలేదు. ఖాళీ స్థలాలను గుర్తించి ఒక్కో ప్లాటుకు ఒక్కో ధర నిర్ణయించి విక్రయిస్తున్నారు. అమ్మకాలు, కొనుగోళ్లు అంతా సాదా పత్రాల్లోనే మారుతూ ఉంటుంది. సొంతంగా పట్టా ఉన్నవారి ప్లాట్లను ఆక్రమించిన ఘటనలు గతం నుంచి నేటి వరకు సర్వసాధారణం.
100 ఫీట్ల రోడ్డు అన్యాక్రాంతం
ఇందిరమ్మ కాలనీలో 100 ఫీట్ల రోడ్డు నిర్మించేందుకు వీలుగా ప్లాట్లను ఏర్పాటు చేసి గతంలో అందించారు. ప్రస్తుతం ఆ రోడ్డు నిర్మాణం కాకపోవడంతో 30 ఫీట్లు రోడ్డు వదిలి ఇరు వైపులా మిగిలి పోతున్న 35 ఫీట్ల చొప్పున భూమిని కూడా కాజేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈక్రమంలో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం అక్రమార్కులకు వరంగా మారింది. కాలనీలో పూర్తిస్థాయిలో సర్వే చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఇష్టారాజ్యంగా నిర్మాణాలు


