రామగుండం: సికింద్రాబాద్ డివిజన్ పరిధి గ్రాండ్ రూట్ (ఢిల్లీ–చైన్నె)లో ఏళ్లుగా ట్రయల్ రన్ ప్రత్యేక రైళ్ల పేరుతో రాకపోకలు సాగిస్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆక్యుపెన్సీ సాధిస్తున్నా కేంద్ర రైల్వేశాఖ రెగ్యులర్ రైళ్లుగా క్రమబద్ధీకరించకపోవడంతో ప్రయాణికుల్లో అసంతృప్తి నెలకొంది. కాగా, ప్రత్యేక రైళ్లను క్రమబద్ధీకరణ చేయించేందుకు సంబంధిత రూట్లకు చెందిన పార్లమెంట్ సభ్యులు సైతం రైల్వే మంత్రిత్వశాఖపై ఒత్తిడి చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది. ప్రత్యేక రైళ్లను రెగ్యులర్ రైళ్లుగా గుర్తించేలా ఎంపీలు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పలు ప్రత్యేక రైళ్లను రెగ్యులర్‌గా మార్చిన విషయం తెలిసిందే.
స్పెషల్ రైళ్ల రాకపోకలకు కారణాలు
ఒక రూట్‌లో నడిచే రైలు నిత్యం పరిమితికి మించిన ప్రయాణికులు, క్షణాల్లో రిజర్వేషన్ వెయిటింగ్ స్థాయికి చేరితే సదరు రూట్‌లో ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంటారు. వీటితో పాటు ఫెస్టివల్ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని బట్టి ప్రత్యేక రైళ్లను వేస్తారు. కాగా సదరు ప్రత్యేక రైళ్లు సాధారణ రోజుల్లో కూడా ఆక్యుపెన్సీ సాధించడంతో వాటిని రెగ్యులర్‌గా క్రమబద్ధీకరించే అవకాశాలు ఉంటాయి. కానీ ఏళ్లుగా ట్రయల్‌రన్‌తో నడిపిస్తుండడంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీటిని ప్రత్యేక రైళ్లుగా ఎలా గుర్తించాలంటే రైలు నంబర్ జీరోతో ప్రారంభమవుతుంది. వీటి రాకపోకలు నిర్దేశిత సమయంలోగా గమ్యస్థానం చేరే అవకాశాలు తక్కువ. అకారణంగా రద్దయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. రెగ్యులర్ రైలుకు నిర్దేశిత సమయం ఉండడంతో ప్రయాణికులు సమయపాలన పాటించే అవకాశం ఉంటుంది.
సికింద్రాబాద్–ఢిల్లీ రూట్‌లో ప్రత్యేక రైళ్లు..
● రైలు నం.07075 హైదరాబాద్–గోరఖ్‌పూర్ మధ్య ప్రత్యేక రైలు పేరుతో డిసెంబర్ 15, 2023న వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలుగా రాకపోకలు సాగిస్తుంది.
● రైలు నం.07051 తిరుపతి–రాక్సల్ మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా రాకపోకలు సాగిస్తుంది.
● రైలు నం.03253 పాట్నా–చర్లపల్లి మధ్య ఫెస్టివల్ స్పెషల్ పేరుతో వారంలో రెండురోజులు రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలు ఇదే రూట్‌లో డిసెంబర్ 26, 2022 నుంచి నడుస్తుంది.
● రైలు నం.07255 చర్లపల్లి–పాట్నా మధ్య ప్రతీ బుధవారం రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలు మార్చి19, 2025లో ప్రారంభమైంది.
● రైలు నం.03225 దాణాపూర్–చర్లపల్లి మధ్య ఫెస్టివల్ స్పెషల్ (హోలి, సమ్మర్) రైలు. ప్రయాణికుల రద్దీని గుర్తించి ఈనెల 5 నుంచి రాకపోకలు సాగిస్తుంది.
● రైలు నం.07197 కాజీపేట–దాదర్ మధ్య వీక్లీ ప్రత్యేక రైలు ఏప్రిల్ 12, 2025న ప్రారంభించినప్పటి నుంచి వారాంతపు రైలుగా రాకపోకలు సాగిస్తుంది.
● రైలు నం.07015 నాందేడ్–తిరుచానూర్ మధ్య యాత్రీ స్పెషల్ పేరుతో జూలై 5, 2025 నుంచి వారాంతపు రైలుగా రాకపోకలు సాగిస్తుంది.
● రైలు నం.07189 నాందేడ్–ధర్మవరం (తిరుపతి, ధర్మవరం, యాత్రలు, ఎక్కువ రద్దీ) మధ్య జూలై 4, 2025 నుంచి వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైలుగా రాకపోకలు సాగిస్తుంది.
ఏళ్లుగా ప్రత్యేక రైళ్ల పేరుతోనే రాకపోకలు


