జిల్లాలో ఇసుక మాఫియాదే రాజ్యం అనుమతి లేకున్నా అక్రమంగా తరలింపు అధికారుల కళ్లుగప్పి రాత్రివేళ ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణాతో గ్రామాల మధ్య వివాదం
జగిత్యాలక్రైం: జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతం అధికం. ఈ నది నుంచి నిత్యం వందలాది ట్రాక్టర్లు, టిప్పర్లు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాయి. మెట్‌పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, రాయికల్, సారంగాపూర్, ధర్మపురి, వెల్గటూర్ మండలాల్లోని గ్రామాల నుంచి ఇసుక రవాణా అవుతోంది. ఇబ్రహీంపట్నం మండలం కోమటికొండాపూర్, ఎర్దండి, మూలరాంపూర్, మల్లాపూర్ మండలం వాల్గొండ, వీవీరావుపేట, సంగెంశ్రీరాంపూర్, రాయికల్ మండలం ఇటిక్యాల, కొత్తపేట, బోర్నపల్లి, దావన్‌పల్లి, బీర్‌పూర్ మండలం కమ్మునూర్, మంగేళ, రంగసాగర్, చిన్నకొల్వాయి, రేకులపల్లి, ధర్మపురి మండలం ఆరెపెల్లి, జైన, దొంతాపూర్, దమ్మన్నపేట, తిమ్మాపూర్ గ్రామాల నుంచి రాత్రివేళల్లో అధికారుల కళ్లుగప్పి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా సమీప ప్రాంతం నుంచి పట్టణప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఇసుక క్వారీలకు ప్రభుత్వం అధికారికంగా గుర్తించినా.. రవాణా చేసేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ కొంతమంది ఇసుక మాఫియాదారులు అధికారుల కళ్లుగప్పి లారీలు, ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. అడ్డుకోవాల్సిన మైనింగ్ అధికారులు తమ వద్ద సిబ్బంది లేరని, పోలీసులు, రెవెన్యూ శాఖ సహాయం ద్వారానే ఇసుక రవాణాను అరికట్టాలని చెబుతుండడం గమనార్హం.
స్టాక్ పాయింట్లకు ఆదరణ కరువు
ప్రభుత్వం వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని జిల్లాలో మూడు ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. జగిత్యాల ఇసుక స్టాక్ పాయింట్ వద్ద అమ్మకాలు చేపడుతున్నా.. అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ ఇసుక పాయింట్ల వద్ద ఇసుక రేట్లు కూడా ఎక్కువగా ఉండటంతో చాలామంది వినియోగదారులు బయట నుంచి వచ్చే ఇసుకనే కొనుగోలు చేస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో ఇసుక అక్రమ
రవాణా జోరుగా సాగుతోంది. మాఫియా ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. ఆయా పోలీస్‌స్టేషన్ల మీదుగానే అక్రమంగా రవాణా అవుతున్నా.. చర్యలు చేపట్టడంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు విఫలమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక మాఫియా, నాయకుల ఆగడాలతో ఆయా గ్రామాల్లో సరిహద్దు వివాదాలు తలెత్తుతున్నాయి.


