కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న నాయకులు
కరీంనగర్‌కార్పొరేషన్: నగరపాలకసంస్థలో అవసరం లేకున్నా ఔట్‌సోర్సింగ్‌లో ఉద్యోగులను నియమించుకొని సొంత పనులు చేయించుకుంటున్నారని యువజన కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. గురువారం కలెక్టర్ గోపిని యువజన కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్, ఇమ్రాన్, మొహమ్మద్ అమిర్‌లు కలిసిన ఫిర్యాదు చేశారు. టౌన్ ప్లానింగ్, శానిటేషన్, హరితహారం, ఫిల్టర్‌బెడ్, వాటర్‌సప్లయి, పైప్‌లైన్ లీకేజీ, ఎలక్ట్రికల్, ఎస్‌టీపీ విభాగాల్లో మంజూరు లేకున్నా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకున్నారని వివరించారు. దాదాపు వంద మంది ఉద్యోగులు ఆయా విభాగాల్లో కాకుండా ప్రైవేట్ పనులు చేస్తున్నారని అన్నారు. కార్పొరేటర్లు, కాంట్రాక్టర్ల ఇళ్లల్లో, కార్పొరేటర్ల వాహనాల డ్రైవర్లుగా, అద్దె వాహనాల డ్రైవర్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతీరోజు విధులకు హాజరవుతున్నట్లు చూపిస్తూ బల్దియా ఖజానాకు గండికొడుతున్నారన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.


