మా ఆయనను కాపాడండి..
● ఉపాధి పేరిట ఏజెంట్ మోసం
● స్వదేశానికి రప్పించాలంటున్న
బాధిత కుటుంబాలు
బాన్సువాడ రూరల్: ఏజెంట్ మోసంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు యువకులు రష్యా సైన్యంలో చేరి విలవిలలాడుతున్నారు. అక్కడి శిక్షణ తట్టుకోలేక.. స్వదేశం రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ తమ పరిస్థితిని కుటుంబీకులకు వివరిస్తూ ఎలాగైన స్వదేశానికి రప్పించాలని వేడుకుంటున్నారు. బాధిత కుటుంబాలు తెలిపిన వివరాలు ఇలా.. బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన మహ్మద్ అఫ్జల్‌ఖాన్, నిజామాబాద్ జిల్లా మునిపల్లి తండాకు చెందిన బుక్యా రవీందర్, పెద్దవాల్గోట్‌కు చెందిన సిర్సు అశోక్, దమ్మన్నపేట్ తండా ధర్పల్లికి చెందిన మేగావత్ ప్రకాష్‌తో పాటు మరో వ్యక్తి ఉపాధి నిమిత్తం ఫిబ్రవరిలో రష్యా వెళ్లారు. మాస్కో నగరంలో 6నెలల పాటు మెకానికల్ ఫీల్డ్ హెల్పర్ విభాగంలో పనిచేశారు. పని ముగిసిందని స్వదేశం వెళ్లిపోవాలని ఏజెంట్ గంగాధర్ చేతులెత్తేశాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న నలుగురిని దోమకొండకు చెందిన తెల్లకృష్ణ రష్యన్ ఆర్మీలో గార్డెనింగ్, లోడింగ్–అన్‌లోడింగ్ పేరిట పనిలో చేర్పించాడు. కానీ వారిని ఆర్మీలో సైనికులుగా చేర్పించుకుని వారితో ఉక్రేయిన్ యుద్ధం జరుగుతున్న బార్డర్‌లో ఉంచారు. ప్రతిరోజు 10 నుంచి 15కి.మీ నడక, శరీరం తట్టుకోని విధంగా వ్యాయామం చేయిస్తూ గన్స్ పేల్చడం, మారణాయుధాలను వినియోగించే పద్ధతులపై శిక్షణ ఇస్తున్నట్లు వారు వాపోతున్నారు. సరైన ఆహారం లేక అడవిలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నట్లు కుటుంబీకులకు ఫోన్‌లో వివరిస్తూ బోరుమంటున్నారు.
బాధితుల్లో ముగ్గురు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో బాధిత కుటుంబాలు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని ఆశ్రయించారు. తమవారిని ఎలాగైనా రప్పించాలని విన్నవించడంతో ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి వివరిస్తూ లేఖ రూపొందించారు. రాష్ట్ర ప్రభు త్వం స్పందించి కేంద్ర విదేశాంగ మంత్రి, దౌత్య అధికారులతో మాట్లాడి తమ వారిని విడిపించాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
మా ఆయన మహ్మద్ ఆప్జల్‌ఖాన్ రష్యా సైనికస్థావరంలో అరచేతిలో ప్రాణాలు పట్టుకుని జీవిస్తున్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అక్కడి దౌత్య అధికారులతో మాట్లాడి వెంటనే స్వదేశానికి రప్పించాలి. వారి వాయిస్‌మెసెజ్‌లు విన్నప్పటినుంచి నాతోపాటు మా అత్తమామ, కుటుంబసభ్యులకు కంటిమీద కునుకు కరువైంది.
–జమీలా బేగం, తాడ్కోల్, బాన్సువాడ మండలం


