తెరపైకి ఫ్లోటింగ్‌ సోలార్‌! | - | Sakshi
Sakshi News home page

తెరపైకి ఫ్లోటింగ్‌ సోలార్‌!

Sep 22 2026 1:42 AM | Updated on Sep 22 2026 1:42 AM

తెరపైకి ఫ్లోటింగ్‌ సోలార్‌! ‘నైస్‌’ నివేదిక ఇలా..

జల విద్యుత్‌కు ప్రత్యామ్నాయం!

పర్యావరణహిత పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం.. ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తోంది. భూసేకరణ సమస్య లేకపోవడం, నీటి ఆవిరి నష్టాలను తగ్గించే అవకాశం ఉండడంతో ఈ ప్లాంట్ల ఏర్పాటువైపు మొగ్గుచూపుతోంది. ఈ నేపథ్యంలో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోలార్‌ ఎనర్జీ(నైస్‌) నిర్వహించిన అధ్యయనంలో నిజాంసాగర్‌ ప్రస్తావన రావడం చర్చనీయాంశంగా మారింది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

అనుకూలంగా నిజాంసాగర్‌ ప్రాజెక్టు

1.11 గిగా వాట్ల విద్యుదుత్పత్తికి అవకాశం

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోలార్‌

ఎనర్జీ అధ్యయనంలో వెల్లడి

మంజీర నదిపై అచ్చంపేట ప్రాంతంలో నిర్మించిన నిజాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద జల విద్యుదుత్పత్తి కేంద్రం ఉంది. ఇక్కడ గతంలో ఏటా రెండు టర్బయిన్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి జరిగేది. అయితే జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఆధునికీకరిస్తుండడంతో కొన్నేళ్లుగా ఉత్పత్తి ప్రక్రియ నిలిచిపోయింది. మరమ్మతులు పూర్తవగానే విద్యుత్‌ తయారీని పునరుద్ధరించనున్నారు. కాగా పర్యావరణ అనుకూల పునరుత్పాదక ఇంధన వనరులపై సర్కారు దృష్టి సారిస్తోంది. సౌర విద్యుదుత్పత్తిని ప్రోత్సహిస్తున్న కేంద్రం.. భూసేకరణ సమస్య లేని నీటిపై తేలియాడే సౌర విద్యుత్‌ ప్లాంట్ల (ఫ్లోటింగ్‌ సోలార్‌) ఏర్పాటుకు మొగ్గు చూపుతోంది. నీటి ఉపరితలంపై సౌరఫలకలు ఏర్పాటు చేసి విద్యుత్‌ ఉత్పత్తి చేసే విధానమే ఫ్లోటింగ్‌ సోలార్‌. జలాశయాలపై ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి పెద్దగా భూమి కూడా అవసరం ఉండదు. నీటి ఉపరితలంపై సోలార్‌ ఫలకలు ఏర్పాటు చేయడం ద్వారా నీరు ఆవిరవడం కూడా కొంతమేర తగ్గుతుంది.

అసెంబ్లీలో ప్రస్తావించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

ఫ్లోటింగ్‌ సోలార్‌ ఎనర్జీ ప్లాంట్ల గురించి ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ప్రస్తావించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పోచారం ప్రాజెక్టులో ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పోచారం ప్రాజెక్టు ఏటా నిండడంతో పాటు రెండు పంటలకూ నీరందిస్తున్నామని, ఈ ప్రాంతం ఫ్లోటింగ్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే నైస్‌ నివేదిక కూడా ఉండడంతో ఫ్లోటింగ్‌ సోలార్‌ గురించి చర్చ నడుస్తోంది.

దేశవ్యాప్తంగా ఎల్‌ నినో ప్రభావంతో ఎక్కడా పెద్దగా వర్షాలు కురవడం లేదు. జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ భారీ నీటిపారుదల ప్రాజెక్టు అయిన నిజాంసాగర్‌ ఇప్పటికీ నిండలేదు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుదీ అదే పరిస్థితి ఉంది. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా జల విద్యుత్‌ ఉత్పత్తి జరిగేది. నిజాంసాగర్‌లో ఆధునికరణ పనులు జరుగుతుండగా, శ్రీరాంసాగర్‌కు వరద పోటెత్తకపోవడంతో ఉత్పత్తి లేదు. భారీ వరదలు వచ్చి జలాశయం నిండితేగానీ విద్యుత్‌ ఉత్పిత్తి జరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో జల విద్యుత్‌ ఉత్పత్తికి ఫ్లోటింగ్‌ సోలార్‌ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు ప్రత్యామ్నాయం అవుతుందని భావిస్తున్నారు.

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోలార్‌ ఎనర్జీ (నైస్‌) అనేది దేశంలో సౌర శక్తి రంగానికి సంబంధించిన అత్యున్నత పరిశోధన, అభివృద్ధి సంస్థ. ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుపై ఈ సంస్థ ఇటీవల రూపొందించిన ఫ్లోటింగ్‌ సోలార్‌ సామర్థ్య నివేదికలో తెలంగాణలోని పలు జలవనరులను ప్రస్తావించారు. ఇందులో రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో ఒకటైన నిజాంసాగర్‌ గురించి ప్రత్యేకంగా పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టులో 20 శాతం నీటి ఉపరితల వినియోగ పరిమితిని పరిగణనలోకి తీసుకున్నపుడు 1.11 గిగా వాట్ల (1,110 మెగావాట్ల) విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేశారు. కాగా శ్రీరాంసాగర్‌కు 1.85 గిగావాట్లు, సింగూరుకు 1.09 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉందని నివేదికలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement