ిపట్లం: మండలంలోని లోధా సామాజిక వర్గానికి తగిన న్యాయం చేస్తామని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ పేర్కొన్నారు. పిట్లంను బుధవారం తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు సందర్శించారు. మండలకేంద్రంలోని ఫంక్షన్‌హాలులో లోధా/లోధి సామాజిక వర్గానికి సంబంధించిన అంశాలపై విచారణ నిర్వహించారు. ఆ సామాజికవర్గానికి చెందినవారు హాజరై తమ సమస్యలు, అభ్యర్థనలను కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి తదితర ప్రాంతాలలో లోధా, లోధి సామాజిక వర్గానికి బీసీ బి సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. పిట్లం, బిచ్కుంద తదితర ప్రాంతాలలో వీరు లొద్ద కులంగా ప్రాచుర్యం పొంది, బీసీ డి సర్టిఫికెట్ పొందారని, కానీ బీసీ బీకి మార్చాలని వినతులు రావడంతో ఇక్కడికి వచ్చామని పేర్కొన్నారు. పిట్లం మండలంలో మొత్తం 108 కుటుంబాలలో 452 వందల సభ్యులు ఉన్నారని, నివేదికలను ప్రభుత్వానికి సమర్పించి తగిన న్యాయం చేస్తామని పేర్కొన్నారు. బీసీ సంఘ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


