● కలెక్టర్‌కు అనుభవాలు వివరించిన
జిల్లా ఉపాధ్యాయులు
కామారెడ్డి టౌన్: జపాన్‌లో నిర్వహించిన ‘టీచర్ ఎక్స్‌పోజర్ విజిట్–2026’లో పాల్గొన్న జిల్లా ఉపాధ్యాయులు బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి తమ పర్యటన అనుభవాలను వివరించారు. చిన్నమల్లారెడ్డి ఉన్నత పాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు పిల్లమారి ప్రవీణ్‌కుమార్, కొండాపూర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు ఇందిర జపాన్‌లోని పాఠశాలల నిర్వహణ, బోధనా పద్ధతులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి పాఠశాలల్లో విద్యార్థి కేంద్రీకృత బోధన, క్రమశిక్షణ, నైతిక విలువలు, సమయపాలన, పరిశుభ్రత, స్వయం బాధ్యత, ప్రయోగాత్మక విద్య వంటి అంశాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని వారు తెలిపారు. జపాన్ విద్యా విధానంలోని ఉత్తమ పద్ధతులను మన పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడి పాఠశాలల్లో అమలు చేసేందుకు తోటి ఉపాధ్యాయులతో పంచుకుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ సెంటర్ (జేఐసీఈ) డైరెక్టర్ తమకు అందజేసిన ధ్రువీకరణ పత్రాలను కలెక్టర్‌కు చూపించారు. ఈ పర్యటన ద్వారా పొందిన అనుభవాలు విద్యార్థుల అభ్యసన ప్రమాణాల పెంపునకు కృషి చేయాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో మల్లికార్జున్ ఉన్నారు.
ప్రభుత్వ పథకాలపై అవగాహనలో
మీడియాదే కీలక పాత్ర
కామారెడ్డి క్రైం: ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియాదే కీలక పాత్ర అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ వార్తలాప్ మీడియా పీఐజీ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్, సైబర్ సెక్యూరిటీ అనే అంశాలపై బుధవారం కలెక్టరేట్‌లో జర్నలిస్టులకు వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ పట్టణాలు, నగరాల్లోని ప్రజలకు చేరువ కావడం, ముఖ్యమైన అంశాలపై ప్రజలను మీడియా ద్వారా చైతన్యపరచడం లక్ష్యంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. అనంతరం నషా ముక్త్ భారత్ అభియాన్‌కు సంబంధించిన అంశాలను ఈగల్ ఫోర్స్ డీఎస్పీ సోమనాథం వివరిస్తూ మాదకద్రవ్యాల దుర్వినియోగంతో కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్ సెక్యూరిటీపై సీడాక్ సీనియర్ సైంటిస్ట్ జగదీష్‌బాబు మాట్లాడుతూ సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పీఐబీ జాయింట్ డైరెక్టర్ డా. మనస్ కృష్ణకాంత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్‌వై గిరి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ముకుందరెడ్డి, పీఐబీ మీడియా, కమ్యూనికేషన్ ఆఫీసర్ శివచరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


