కామారెడ్డి రూరల్: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరు మృతి చెందిన ఘటన లింగాపూర్‌లో చోటు చేసుకుంది. దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన మ్యాదరి పిల్లి రవి(45) వినాయక చవితి రోజున రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పలు చోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం లింగాపూర్ చెరువులో రవి మృతదేహం బయటకు తేలడంతో స్థానికులు కుటుంబీకులకు సమాచారం అందించారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడని ఎస్సై తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఇందల్వాయి: మండలంలోని మేఘ్యనాయక్ తండాకు చెందిన లకావత్ పరశురామ్(38) అనే వ్యక్తి గన్నారం శివారులో రోడ్డుపై అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్సై సుమలత బుధవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మేఘ్యనాయక్ తండాకు చెందిన పరశురామ్ జిల్లా కేంద్రంలో ఉన్న బంధువు రాథోడ్ సంతోష్ వద్దకు మంగళవారం మధ్యాహ్నం వెళ్లాడు. అయితే బుధవారం ఉదయం గన్నారం గ్రామ శివారులో రోడ్డుపై రక్తపు మడుగులో పడి మృతి చెంది ఉండటాన్ని స్థానికుల ద్వారా తెలిసినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు
పెద్దకొడప్‌గల్: బైక్ అదుపుతప్పి కిందపడిన ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. డోంగ్లీ గ్రామానికి చెందిన హనుమంత్ అనే వ్యక్తి మంగళవారం అర్ధరాత్రి దెగ్లూర్ నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై వెళ్తుండగా మండలంలోని కౌలాస్ ఎల్లమ్మ చౌరస్తా సమీపంలో ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి కింద పడిపోయాడు. ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు హైవే అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


