గత ఆరు నెలల్లో రోడ్డు ప్రమాదాలు
● 765 డీ రహదారిపై పలుచోట్ల
తరచూ ప్రమాదాలు
● ఆరు నెలల్లో పదికిపైగా ప్రమాదాలు
● పెరిగిన వాహనాల వేగంతో ఆందోళన
నాగిరెడ్డిపేట: రాష్ట్ర రహదారిగా ఉన్న హెచ్‌ఎంబీ రోడ్డును ప్రభుత్వం గతేడాది జాతీయ రహదారి–765డీ గా ప్రకటించింది. అనంతరం మెదక్ నుంచి గోపాల్‌పేట, ఎల్లారెడ్డి, బొగ్గుగుడిసె, మహ్మద్‌నగర్, బాన్సువాడ, వర్ని, రుద్రూర్ వరకు రహదారి విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. మెదక్ నుంచి బొగ్గుగుడిసె వరకు ఒక సంస్థ, బొగ్గుగుడిసె నుంచి రుద్రూర్ వరకు మరో సంస్థ పనులు చేపట్టింది. మెదక్–బొగ్గుగుడిసె మధ్య పనులు దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి.
జాతీయ రహదారిగా మారిన తర్వాత మెదక్–గోపాల్‌పేట–ఎల్లారెడ్డి మార్గంలో వాహనాల వేగం పెరిగింది. మండలంలోని పోచారం, గోపాల్‌పేట, ధర్మారెడ్డి, మాచాపూర్ తదితర ప్రాంతాల్లో మెయిన్ రోడ్డుతోపాటు ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేశారు. అయితే సర్వీస్ రోడ్డు నుంచి ప్రధాన రహదారిపైకి వచ్చే సమయంలో వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. జాతీయ రహదారి నిబంధనలపై గ్రామీణ ప్రాంత వాహనదారుల్లో అవగాహన పెంచాలి.
ద్విచక్రవాహనదారులు, వృద్ధులు, ట్రాక్టర్లు, ఆటో లు, ఇతర గ్రామీణ వాహనాల డ్రైవర్లు ప్రధాన రహదారిపైకి వచ్చే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. సర్వీస్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డులోకి ప్రవేశించే ప్రాంతాల్లో వేగ నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలి. మండలంలోని మాల్తుమ్మెదగేట్, చీనూర్, బంజార, ఆత్మకూర్‌గేట్ ప్రాంతాల్లో తర చూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గోపాల్‌పేట మండల కేంద్రంలో సర్వీస్ రోడ్ల నుంచి ప్రధాన రహదారిపైకి వచ్చే ప్రాంతాలు కూడా ప్రమాదకరంగా మారాయి. బస్టాండ్, పెట్రోల్‌బంక్ సమీపంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలను నియంత్రించేందుకు నాగిరెడ్డిపేట పోలీసులు తగుచర్యలు చేపడుతున్నారు. పెట్రోల్‌బంక్ సమీపంలో ఉన్న దారులకు అడ్డంగా బారీకేడ్లను ఏర్పాటుచేశారు. మండలంలోని బంజార, లింగంపల్లికలాన్ గ్రామాల్లోకి వెళ్లే రోడ్లపై సైతం బ్యారెళ్లను ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై యాక్సిడెంట్ పాయింట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో పోలీసులు హైవే అథారిటీ అధికారుల సహకారంతో రంబుల్ స్టిప్స్ వేయించారు.
మార్చి – గోపాల్‌పేట: మండల కేంద్రం గోపాల్‌పేటలో జాతీయ రహదారి నుంచి చీనూర్ రోడ్డులోకి వెళ్తున్న బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో మహదేవునిగడ్డ తండాకు చెందిన వ్యక్తి మృతిచెందాడు.
ఏప్రిల్ – ఆత్మకూర్‌గేట్: ఆత్మకూర్‌గేట్ సమీపంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఎదురుగా వచ్చిన కారు బలంగా ఢీకొన్నది. ప్రమాదంలో అతను ప్రాణాలు కోల్పోయాడు.
ఏప్రిల్ – మాల్తుమ్మెదగేట్: మాల్తుమ్మెదగేట్ వద్ద ఎక్సెల్‌పై వెళ్తున్న వ్యక్తిని ఇన్నోవా కారు ఢీకొన్నది. ఈ ఘటనలో వ్యక్తి మృతిచెందాడు.
మే – మాల్తుమ్మెదగేట్: ఇదే ప్రాంతంలో ఎక్సెల్‌పై వెళ్తున్న వ్యక్తిని ఆటో ఢీకొనడంతో అతను మృతిచెందాడు.
జూలై – మాల్తుమ్మెదగేట్: వరినాట్లు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న కూలీలతో ప్రయాణిస్తున్న ఆటో గేదెను ఢీకొని బోల్తాపడింది. ప్రమాదంలో పలువురు మహిళలు గాయపడ్డారు.
ఆగస్టు 10 – గోపాల్‌పేట: మండలకేంద్రంలోని పెట్రోల్‌బంక్ సమీపంలో ఆటోను కారు ఢీకొన్నది. ప్రమాదంలో ఆటోడ్రైవర్ మృతిచెందాడు.
సెప్టెంబర్ 1 – బంజారతండా: మండలంలోని బంజారతండా వద్ద ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
సెప్టెంబర్ 12 – బంజారతండా: బంజారతండా వద్ద ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
సెప్టెంబర్ 13 – ఆత్మకూర్‌గేట్: ఆత్మకూర్‌గేట్ వద్ద ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
నియంత్రణ చర్యలు చేపడుతున్నాం
మండలంలో జాతీయ రహదారి ఏర్పాటు అయ్యాక చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను యాక్సిడెంట్ పాయింట్లుగా గుర్తించాం. యాక్సిడెంట్ పాయింట్లలో బ్యారెళ్లను ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని నియంత్రిస్తున్నాం. అయినా సర్వీస్ రోడ్ల నుంచి సడెన్‌గా మెయిన్ రోడ్డులోకి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. తగు చర్యలు చేపడుతున్నాం.
– భార్గవ్‌గౌడ్, ఎస్సై, నాగిరెడ్డిపేట


