కామారెడ్డి టౌన్ : బల్దియాలో మెరుగైన పారిశుద్ధ్యమే లక్ష్యమని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో బుధవారం నూతనంగా కొనుగోలు చేసిన నాలుగు ఇంటింటా చెత్త సేకరణ ఆటోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. పట్టణ విస్తరణకు అనుగుణంగా వార్డుల్లో చెత్త సేకరణ, పారిశుద్ధ్య పనులను సమర్థవంతంగా చేపట్టేందుకు ఈ నూతన వాహనాలను కొనుగోలు చేసామన్నారు. ఈ ఆటోలను 1, 2, 13, 45, 38.39, 26,27,28 వార్టులకు కేటాయించామని తెలిపారు. వైస్ చైర్‌పర్సన్ కాసర్ల గోదావరి, కమిషనర్ పర్వతాలు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ రూరల్: గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు పంచాయతీ కార్యదర్శులు ప్రాధాన్యం ఇవ్వాలని బాన్సువాడ డీఎల్‌పీవో ప్రసాద్ అన్నారు. బుధవారం ఆయన తాడ్కోల్ గ్రామంలో పర్యటించారు. గ్రామంలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను గ్రామ సర్పంచ్ అందె రమేష్‌తో కలిసి పరిశీలించారు. ఆయన వెంట మండల కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
లింగంపేట : మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం ఐకేపీ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్(ఏపీడీ) విజయలక్ష్మి విద్యార్థులకు అందజేసిన ఏకరూప దుస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల యునిఫామ్ స్టిచ్చింగ్ నాణ్యత, కొలతలు, ఫిట్టింగ్, కుట్టు పనితనం తదితర విషయాలను విద్యార్థులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, ప్రత్యేకాధికారి వాసంతి, ఏపీఎం వినోద్‌కుమార్, సీసీలు గంగరాజం, మమత, కవిత, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి: సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని ఏఎస్సై దేవాగౌడ్ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి బస్టాండ్‌లో పోలీసు కళాజాత బృందం చేత ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని, మద్య సేవించి వాహనాలను నడపొద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని కళాజాత ద్వారా వివరించారు. కళాజాత బృందం సభ్యులు తిరుపతి, శేషారావు, ప్రభాకర్, సాయిలు, మహేందర్, రచన పాల్గొన్నారు.


