కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలో గణపతి నవరాత్రుల శోభ నెల రోజుల ముందే మొదలైంది. ప్లాస్ట ర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) రసాయన రంగుల విగ్రహాలకు స్వస్తి పలుకుతూ, పర్యావరణహిత మట్టి గణ పతుల వైపు భక్తులు మొగ్గు చూపుతున్నారు. ఈ మార్పును ఒడిసిపట్టుకున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా కళాకారులు జీవం ఉట్టిపడే అద్భుత మట్టి విగ్రహాలను తీర్చిదిద్దుతున్నారు. దీంతో మట్టి విగ్రహాలకు చాలా డిమాండ్ ఉంది. నాలుగు నెలల ముందుగా బుకింగ్ చేసుకుంటేనే విగ్రహాలు తయారుచేసి ఇస్తున్నారు.
కలకత్తాలోని హుగ్లీ నదీ తీరం, విజయవాడ కృష్ణా నది ఒండ్రు మట్టితోపాటు గడ్డి, వెదురు బొంగులు, జనపనారను ఉపయోగించి విగ్రహాలను సిద్ధం చే స్తున్నారు. సాధారణంగా మట్టి విగ్రహాలంటే చిన్న పరిమాణంలోనే ఉంటాయన్న భావనను పటాపంచలు చేస్తూ 3 అడుగుల నుంచి ఏకంగా 20 అడుగు ల ఎత్తు వరకు భారీ మట్టి విగ్రహాలను తయారుచేస్తున్నారు. నీటిలో త్వరగా కరిగిపోయే సహజసిద్ధ మైన వాటర్ కలర్లను వినియోగిస్తుండటం విశేషం.
జిల్లా కేంద్రంలో సిరిసిల్లారోడ్‌లో మట్టి గణపతి విగ్రహాలను తయారు చేస్తున్నారు. మట్టి విగ్రహాల తయారీకి ఎంతో సమయం, శ్రమ అవసరం కావడంతో నాలుగు నెలల క్రితమే ఉత్సవ కమిటీలు, భక్తుల నుంచి బుకింగ్‌లు స్వీకరించారు. కామారెడ్డితోపాటు నిజామాబాద్, మెదక్, సిరిసిల్ల, సిద్దిపేట తదితర జిల్లాల నుంచి సైతం ఉత్సవ కమిటీలు మట్టి వినాయకులను ముందస్తుగా బుకింగ్ చేసుకున్నారు. ఉత్సవాలకు ఆరు నెలల కిత్రమే కళాకారులు పశ్చిమబెంగాల్ రాష్ట్రం కలకత్తా నుంచి కామారెడ్డికి చేరుకుంటారు. వారి భార్యాపిల్లలకు దూరంగా ఉంటూ విగ్రహాల తయారీచోటే ఉంటున్నారు. వినాయక ఉత్సవాల తర్వాత వెంటనే దుర్గామాత విగ్రహాలను తయారీలో నిమగ్నమవుతున్నారు.
పీవోపీ విగ్రహాలు అరగంటలో అచ్చుపోసి సిద్ధం చేయొచ్చు. కానీ 3 నుంచి 20 ఫీట్ల ఎత్తు వరకు మట్టి విగ్రహం చేయడం కత్తిమీద సాము లాంటిది. వెదురు, గడ్డి కట్టి, దానిపై గంగ నది మట్టిని పొరలు పొరలుగా అద్దుతూ తీర్చిదిద్దుతాం. ఒక్కో పెద్ద విగ్రహం పూర్తి కావడానికి 2–3 నెలలకు పైగా పడుతుంది. ఎండ, తేమను బట్టి విగ్రహాలు పగుళ్లు రాకుండా చూసుకుంటాం. వీటికి సహజసిద్ధమైన రంగులే వేస్తాం. దీంతో నిమజ్జనం చేసిన కొద్ది గంటల్లోనే నీటిలో సులభంగా కరిగిపోతాయి. పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు.
– భిష్వజీత్, కోల్‌కతా
ప్రధాన కళాకారుడు
పండుగకు ఆరు నెలల ముందే కుటుంబ సభ్యులను వదిలి ఇక్కడికి వచ్చాం. పిల్లాపాపలకు దూరంగా ఉంటూ రాత్రింబవళ్లు రేకుల షెడ్డులోనే శ్రమిస్తున్నాం. ఇక్కడ మా చేతి కళను గుర్తించి మట్టి గణపతుల కోసం పోటీ పడుతుంటే మా శ్రమంతా మరిచిపోతున్నాం. మేం ప్రాణం పోసిన విగ్రహాలను భక్తిశ్రద్ధలతో తీసుకెళ్తుంటే కలిగే తృప్తి మాటల్లో చెప్పలేం.
– రాకేశ్, కళాకారుడు
జిల్లా కేంద్రంలో ముస్తాబవుతున్న భారీ మట్టివినాయక విగ్రహాలు
గణపతి నవరాత్రి ఉత్సవాలను పర్యావరణ పరిరక్షణే పరమావధిగా జరుపుకోవడానికి భక్తులు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రసాయన రహిత, స్వచ్ఛమైన మట్టి విగ్రహాలకు ఆదరణ పెరిగింది. భక్తుల అభిరుచికి అనుగుణంగా జిల్లాలో కోల్‌కతా కళాకారులు పర్యావరణ హిత మట్టి వినాయక విగ్రహాల తయారీని ముమ్మరం చేశారు.
కామారెడ్డిలో పర్యావరణ హిత
గణనాథుల తయారీ ముమ్మరం
గంగ, కృష్ణా నదుల మట్టితో విగ్రహాలకు జీవం పోస్తున్న కోల్‌కతా కళాకారులు
3 నుంచి 20 ఫీట్ల వరకూ
విగ్రహాల రూపకల్పన
నాలుగు నెలల ముందే బుకింగ్‌లు.. మార్కెట్‌లో పెరిగిన డిమాండ్


