కామారెడ్డి జిల్లాలో రెండు ఫ్యాక్టరీలు.. | - | Sakshi
Sakshi News home page

కామారెడ్డి జిల్లాలో రెండు ఫ్యాక్టరీలు..

Sep 8 2026 1:29 AM | Updated on Sep 8 2026 1:29 AM

పసుపు.. బియ్యం.. సరైన నిర్ణయం 183 ఎకరాల్లోనే చెరుకు సాగు.. ఆయిల్‌పాం సాగు అంతంతే.. సోయా, కంది, మక్క...

పసుపు.. బియ్యం.. సరైన నిర్ణయం

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ప్రపంచ స్థాయి సామర్థ్యం కలిగిన ఉత్పత్తులు, సేవలను గుర్తించి స్థానిక ఉత్పత్తిదారులను ఇంటర్నేషనల్‌ మార్కెట్లతో అనుసంధానం చేయాలన్నది ‘డిస్ట్రిక్ట్‌ ఎక్స్‌పోర్ట్‌ హబ్‌’ ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్‌అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ‘జిల్లాలు –అనువైన ఉత్పత్తులు’ జాబితాను కేంద్రం ఆమోదించింది. సమ్మిళిత ఎగుమతి వృద్ధి కార్యక్రమం కింద రాష్ట్రంలో 31 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ఎగుమతి కేంద్రాలుగా ఎంపిక చేసింది. అయితే ఏ జిల్లాలో ఏ పంట సాగవుతుంది? పంట ఉత్పత్తి ఏ మేరకు ఉంటుందన్న దానిని పరిశీలించకుండా ఎగుమతి కేంద్రాలుగా ఎంపిక చేసినట్టు జాబితాను పరిశీలిస్తే స్పష్టమవుతోంది.

చెరుకు సాగు అంతంతే ఉన్న.. చక్కెర కర్మాగారమే లేని నిజామాబాద్‌ జిల్లాను చక్కెర ఎగుమతి కేంద్రంగా ఎంపిక చేయడం విస్మయానికి గురిచేస్తోంది. నిజాం దక్కన్‌ షుగర్స్‌ మూతబడి దశాబ్దాలు గడిచాయి. సారంగాపూర్‌ చక్కెర కర్మాగారం కూడా మూతబడింది. తిరిగి తెరిపిస్తామని పాలకులు చెప్పిన మాటలేవీ అమలుకు నోచుకోలేదు. నిజామాబాద్‌ జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో సాగవుతున్న చెరుకు పంట విస్తీర్ణం 183 ఎకరాలు మాత్రమే కావడం గమనార్హం.

కామారెడ్డి జిల్లాను ఆయిల్‌ పాం, కోడి మాంసం, కోడి గుడ్ల ఎగుమతి కేంద్రంగా గుర్తించారు. జిల్లాలో ఆయిల్‌ పాం సాగు చేస్తున్నారు. ఇప్పటివరకు 2,727 ఎకరాల్లో మాత్రమే ఆయిల్‌పాం సాగవుతోంది. ఇప్పుడిప్పుడే పంట వస్తోంది. అయితే ఆయిల్‌పాం ఎగుమతి చేయాలంటే వేలాది ఎకరాల్లో పంట సాగవ్వాలి. ఇక్కడ ప్రస్తుతానికి ఆ పరిస్థితి లేదు. ఇక పౌల్ట్రీ ఇండస్ట్రీ ఎగుమతి చేసేంత స్థాయిలో లేదు. ఏ ప్రాతిపదికన ఆయిల్‌పాం, కోడిమాంసం, కోడి గుడ్ల ఎగుమతి కేంద్రాలుగా ఎంపిక చేశారో అధికారులకే తెలియాలి.

కామారెడ్డి జిల్లాలో సోయా, కంది, మక్క పంటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నాయి. జిల్లాలో 80 వేల ఎకరాలకు పైగా సోయా వేస్తున్నారు. మక్క దాదాపు 50 వేల ఎకరాల్లో సాగవుతోంది. కంది పంట సైతం అంతే విస్తీర్ణంతో పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పంట ఉత్పత్తులకు సంబంధించిన కర్మాగారాలు నెలకొల్పి అంతర్జాతీయ మార్కెట్‌కు తరలించడానికి అవకాశం కల్పించాలని రైతులు కోరుతున్నారు.

నిజామాబాద్‌ జిల్లాను పసుపు ఎగుమతి కేంద్రంగా గుర్తించడం భావ్యమే. పసుపు సాగులో ఇందూరు ముందుంది. ప్రస్తుతం 25,807 ఎకరాల్లో ఈ పంట సాగవుతోంది. అలాగే ఇందూరు అన్నపూర్ణగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ 4.35 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవుతోంది. ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలుస్తున్న నిజామాబాద్‌ జిల్లాలో రైస్‌మిల్‌ ఇండస్ట్రీ సైతం విస్తరించి ఉంది. నిజామాబాద్‌ను బియ్యం ఎగుమతి కేంద్రంగా ఎంపిక చేయడం సరైన నిర్ణయమేనంటున్నారు.

కామారెడ్డి జిల్లాలో ప్రయివేటు రంగంలో రెండు చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. ఏటా 7 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా చెరుకు గానుగాడిస్తున్నారు. టన్నుకు క్వింటాలు చొప్పున చక్కెర వ స్తుంది. రెండు కర్మాగారాల్లో కలిపి 7 లక్షల మె ట్రిక్‌ టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతోంది. చక్కెర ఎగుమతి చేయడానికి మంచి అవకాశాలుంటాయి. చెరుకు సాగులేని, ఫ్యాక్టరీలు లేని నిజామాబాద్‌ కన్నా కామారెడ్డిని ఎంపిక చేయడం ఉత్తమమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఉత్పత్తి అంతగా లేని ప్రాంతాలకు

ఎగుమతి కేంద్రాలుగా అనుమతి

కామారెడ్డి నుంచి ఆయిల్‌ పాం,

కోడి మాంసం..

షుగర్‌ ఫ్యాక్టరీలు లేని

నిజామాబాద్‌ నుంచి చక్కెర..

చక్కెర కర్మాగారాలున్న కామారెడ్డిని

ఎంపిక చేయకపోవడంపై విమర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement