తనిఖీలు చేస్తున్నాం
జిల్లా కేంద్రంతోపాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి వంటి ప్రధాన పట్టణాల్లో ప్రయివేటు క్లినిక్‌లు, ల్యాబ్‌లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. సాధారణ జ్వరం, కడుపునొప్పి అని వెళ్లినా.. వివిధ రకాల టెస్ట్‌లు రాస్తున్నారు. సీబీపీ, థైరాయిడ్, లిపిడ్ ప్రొఫైల్, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంటూ భారీ లిస్టు చేతిలో పెడుతున్నారు. ఈ మధ్య సీటీ స్కానింగ్ చేయించుకోవాలని చెప్పడం ఆనవాయితీగా మారింది. రోగి ఆస్పత్రికి రాగానే డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్‌లో మందుల కన్నా ల్యాబ్ టెస్టుల జాబితానే ఎక్కువగా ఉంటోందన్న విమర్శలున్నాయి. పరీక్షలకు వేలకువేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుండడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.
పర్యవేక్షణ కరవు..
జిల్లాలో అనుమతులు లేని డయాగ్నోస్టిక్ సెంటర్లు, అర్హత గల టెక్నిషియన్లు లేని ల్యాబ్‌లు యథేచ్ఛగా నడుస్తున్నా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పరీక్షల ధరలపై ఎక్కడా నియంత్రణ బోర్డులు లేవు. ఈ దోపిడీపై టాస్క్‌ఫోర్స్ తనిఖీలు చేపట్టి, అనవసర టెస్టులతో రోగులను పీల్చిపిప్పి చేస్తున్న ప్రయివేటు దవాఖానాలు, ల్యాబ్‌లు, స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రోగులకు ఆర్థికభారం
డాక్టర్లు, ఆర్‌ఎంపీలు, డయాగ్నోస్టిక్, స్కానింగ్ సెంటర్ల దందా
అవసరం లేకున్నా రక్త పరీక్షలు,
స్కానింగ్‌ల పేరిట దోపిడీ
20 నుంచి 40 శాతం వరకు కమీషన్లు
జిల్లాలో యథేచ్ఛగా వైద్యవ్యాపారం
పట్టించుకోని వైదారోగ్యశాఖ
అధికారులు
బీబీపేట మండలానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యుడు.. ఫలానా ల్యాబ్‌లో రక్త పరీక్షలతోపాటు సీటీ స్కానింగ్ చేయించుకోవాలని సూచించాడు. తనకు తెలిసిన ల్యాబ్‌లో చేయించుకుంటానని బాధితుడు చెప్పినా డాక్టర్ ఒప్పుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రోగి ఆ ల్యాబ్‌లోనే పరీక్షలు చేయించుకోగా.. రిపోర్టుల్లో అంతా నార్మల్‌గానే వచ్చింది. రెండురోజుల తర్వాత బాధితుడు తన బంధువైన ఓ ల్యాబ్ నిర్వాహకుడికి జరిగినదంతా చెప్పగా.. డాక్టర్లు, ఆర్‌ఎంపీల దందా గురించి చెప్పాడు. ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్‌ల నుంచి కమీషన్లు వస్తాయని, అందుకే రోగులను ఆ కేంద్రాలకు పంపిస్తారని సదరు ల్యాబ్ నిర్వాహకుడు వివరించడంతో రోగి అవాక్కయ్యాడు.
కొందరు వైద్యులు, ప్రయివేటు డయాగ్నోస్టిక్, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకుల మధ్య ‘కమీషన్ల బంధం’ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తోంది. జబ్బు నయమవుతుందన్న ఆశతో ప్రయివేటు ఆస్పత్రుల గడప తొక్కే రోగులకు పరీక్షల పేరిట చుక్కలు కనిపిస్తున్నాయి. అవసరం లేకున్నా టెస్ట్‌లు, స్కానింగ్‌లు రాస్తుండడంతో రోగుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.
– కామారెడ్డి టౌన్
అవసరం ఉంటేనే పరీక్షలు చేయించాలి. ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే ఆస్పత్రులను సీజ్ చేస్తాం. ఆస్పత్రులను తరచూ తనిఖీ చేస్తున్నాం.
– వెంకట్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
పట్టణాల్లోని వైద్యులు, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీ, పీఎంపీలు నిర్దిష్ట డయాగ్నోస్టిక్ సెంటర్లకే రోగులను పంపిస్తున్నారు. సదరు ల్యాబ్, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు ప్రతినెలా సిఫారసు చేసిన వైద్యులు, ఆర్‌ఎంపీలకు కమీషన్‌ల రూపంలో భారీగా డబ్బులు ముట్టజెప్పుతుండడమే దీనికి కారణం. రక్త పరీక్షలు, స్కానింగ్‌లకు 20 నుంచి 40 శాతం వరకు కమీషన్లు ముడుతున్నట్లు తెలిసింది. కొన్ని ఆస్పత్రుల్లో అయితే వైద్యులే ల్యాబ్‌లను నిర్వహిస్తుండడం గమనార్హం.


