కామారెడ్డి రైల్వే గేట్‌ వద్ద అండర్‌పాస్‌ నిర్మించాలి | - | Sakshi
Sakshi News home page

కామారెడ్డి రైల్వే గేట్‌ వద్ద అండర్‌పాస్‌ నిర్మించాలి

Aug 21 2026 2:51 AM | Updated on Aug 21 2026 2:51 AM

కామారెడ్డి రైల్వే గేట్‌ వద్ద అండర్‌పాస్‌ నిర్మించాలి ఆలిండియా సర్వీసెస్‌ క్రీడలకు పేర్లు నమోదు చేసుకోవాలి పచ్చదనం పెంపొందించాలి ఆర్టీసీలో శ్రమ దోపిడీ లేదు

కామారెడ్డి టౌన్‌ : జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌ కాలనీలోగల రైల్వే గేట్‌ వద్ద అండర్‌పాస్‌ బ్రిడ్జి నిర్మించాలని జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌ కుమార్‌ షెట్కార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ అధ్యక్షతన జరిగిన ఎంపీల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అశోక్‌నగర్‌లోని రైల్వే గేటుకు ఒకవైపు కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయంతో పాటు పలు ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయని, ఈ మార్గంలో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయని ఎంపీ పేర్కొన్నారు. రైలు వచ్చినప్పుడల్లా గేటు పడుతుండడంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారన్నారు. అండర్‌పాస్‌ నిర్మించి ఇబ్బందులు తప్పించాలని కోరారు. నిజామాబాద్‌ –కాచిగూడ డెమో రైలును భిక్కనూరులో నిలపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జీఎం సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు.

కామారెడ్డి అర్బన్‌: ఆలిండియా సివిల్‌ సర్వీసెస్‌ క్రీడల (2026–27) జిల్లా స్థాయి ఎంపికలు సెప్టెంబర్‌ 3న నిర్వహించనున్నట్టు జిల్లా యువజన క్రీడల అధికారి రంగా వెంకటేశ్వర గౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు ఈ నెల 31లోగా కలెక్టరేట్‌లోని 223 నంబర్‌ గదిలోని తమ కార్యాలయంలో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాస్థాయిలో ఎంపికై న వారు హైదరాబాద్‌లో సెప్టెంబర్‌ 8, 9 తేదీల్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. అథ్లెటిక్స్‌, బాస్కెట్‌ బాల్‌, షటీల్‌, క్రికెట్‌, చెస్‌, ఫుట్‌బాల్‌, హాకీ, కబడ్డీ, లాన్‌ టెన్నిస్‌, పవర్‌ లిఫ్టింగ్‌, స్విమ్మింగ్‌, టెబుల్‌ టెన్నిస్‌, వాలీబాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌, యోగా, ఖో–ఖో క్రీడాంశాలు ఉన్నాయని తెలిపారు.

కామారెడ్డి క్రైం: కలెక్టరేట్‌ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, పచ్చదనాన్ని పెంపొందించాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులకు సూచించారు. పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంచేందుకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాల వారీగా చర్యలు చేపట్టాలన్నారు. గురువారం కలెక్టరేట్‌ ప్రాంగణంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించారు. ఊటకుంటను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. కలెక్టరేట్‌ ఆవరణలోని అన్ని ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని ఆదేశించారు. నిరంతరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్‌, గిరి, డీఆర్‌వో పాండు, డీడబ్ల్యూవో ప్రసన్న, మెప్మా సీపీవో శ్రీధర్‌ రెడ్డి, ఏవో మస్రూర్‌ అహ్మద్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సాక్షి, ప్రతినిధి, కామారెడ్డి : సంస్థలో శ్రమదోపిడీ జరగడం లేదని కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్‌ దినేశ్‌ పేర్కొన్నారు. ’సాక్షి’ దినపత్రికలో ఈనెల 19న ప్రచురితమైన ‘ఆర్టీసీలో శ్రమ దోపిడీ‘ అనే కథనంపై ఆయన స్పందించి గురువారం ఓ ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు. మోటారు రవాణా కార్మికుల చట్టం–1961 ప్రకారమే ఉద్యోగుల పనివేళలు, డ్యూటీలు అమలవుతున్నాయని తెలిపారు. నిబంధనల ప్రకారం సిబ్బందికి తగిన విశ్రాంతి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఉద్యోగులు 8 గంటల కంటే ఎక్కువ పని చేస్తే అదనపు పనికి రెట్టింపు వేతనం(ఓటీ) చెల్లిస్తున్నామని వివరించారు. అలాగే డబుల్‌ డ్యూటీ చేసే డ్రైవర్లకు రూ. 1,000, కండక్టర్లకు రూ. 710 చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. సంస్థపై ఆర్థికభారం తగ్గించేందుకు నాన్‌స్టాప్‌ బస్సుల్లో డ్రైవర్లకు టిమ్స్‌ అందించామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement