నాడు స్వాగతించి.. నేడు ఏసీబీకి పట్టించి.. | - | Sakshi
Sakshi News home page

నాడు స్వాగతించి.. నేడు ఏసీబీకి పట్టించి..

Aug 21 2026 2:51 AM | Updated on Aug 21 2026 2:51 AM

నాడు స్వాగతించి.. నేడు ఏసీబీకి పట్టించి..

గతంలో డీటీని పట్టించి..

కామారెడ్డిక్రైం/భిక్కనూరు : రాజంపేట ఎస్సై ఆంజనేయులు ఏసీబీకి చిక్కడం హాట్‌ టాపిక్‌గా మారింది. భిక్కనూరు ఎస్సైగా పనిచేసిన ఆంజనేయులు.. 35 రోజుల క్రితం రాజంపేట ఎస్సైగా బదిలీ అయ్యారు. జూలై 16న ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాజంపేట పట్టణ వైశ్యసంఘం అధ్యక్షుడు అయిన ముత్యపు సిద్దరాములు ఎస్సై ఆంజనేయులను స్వాగతిస్తూ జూలై 21వ తేదీన సన్మానించారు. నాడు స్వాగతించిన వ్యక్తే ప్రస్తుతం ఏసీబీకి పట్టించడం గమనార్హం.

అసలేం జరిగిందంటే..

రాజంపేటకు చెందిన ముత్యపు సిద్దిరాములు, ఆయన కుమారుడు సంతోష్‌ స్థానికంగా సిమెంట్‌ దుకాణం నడుపుతున్నారు. వ్యాపార వ్యవహారాల విషయంలో సమీపంలోని మరో సిమెంట్‌ దుకాణం నిర్వాహకులతో ఈనెల 10 న గొడవ జరిగింది. ఇది దాడుల వరకు వెళ్లింది. దీంతో ఇరువర్గాలపై రాజంపేట పీఎస్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విషయంలో సిద్దిరాములు కుమారుడు సంతోష్‌కు స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడం, చార్జ్‌షీట్‌ దాఖలు చేసే సమయంలో సెక్షన్‌లలో మార్పులు చేసి సహకరించడానికి ఎస్సై ఆంజనేయులు రూ.50 వేలు డిమాండ్‌ చేశారు. రూ.40 వేలకు ఇరువురి మధ్య ఒప్పందం కుదిరింది. బాధితుడు మొదట రూ.10 వేలు ఇచ్చాడు. మిగిలిన రూ.30 వేలు ఇవ్వాలని ఎస్సై అడగడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు వలపన్ని గురువారం ఎస్సైని కామారెడ్డిలోని తన నివాసంలో రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. లంచం డబ్బులను స్వాధీనం చేసుకుని, ఎస్సైని అదుపులోకి తీసుకున్నామని ఏసీబీ డీఎస్పీ శేఖర్‌ గౌడ్‌ తెలిపారు. నిందితుడిని హైదరాబాద్‌ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తామన్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1064 కు గానీ, వాట్సాప్‌ నంబర్‌ 94404 46106 కు గానీ ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఏసీబీ అధికారులు కామారెడ్డిలోని ఎస్సై ఇంటితో పాటు రాజంపేట, భిక్కనూరు పీఎస్‌లలో, ఎస్సై సమీప బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో తనిఖీలు, విచారణ జరిపినట్లు తెలిసింది.

ముత్యపు సిద్దరాములు గతంలోనూ ఓ అధికారిని ఏసీబీకి పట్టించారు. సిద్దరాములు పదేళ్ల క్రితం రేషన్‌ దుకాణం నిర్వహించేవారు. రేషన్‌ సరుకులకు సంబంధించిన బ్యాంక్‌ డీడీ విషయంలో పౌర సరఫరాల శాఖలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న బాలయ్య ఇబ్బందులకు గురి చేసి లంచం డిమాండ్‌ చేయడంతో ఏసీబీని ఆశ్రయించారు. అప్పట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేసి డీటీని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇప్పుడు అదే సిద్దరాములు ఎస్సైని ఏసీబీకి పట్టించారు.

స్టేషన్‌ బెయిల్‌కోసం రూ.50 వేలు

డిమాండ్‌ చేసిన ఎస్సై

అవినీతి నిరోధక శాఖను

ఆశ్రయించిన బాధితుడు

రూ.30 వేలు లంచం

తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement