కామారెడ్డి టౌన్: పిల్లలు తప్పులు చేస్తే సరిదిద్దుకునేలా ప్రోత్సహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి నాగరాణి సూచించారు. శుక్రవారం అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆధ్వర్యంలో జువైనల్స్, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత తమ హక్కులు, బాధ్యతలు చట్టపరమైన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. జువైనల్స్ విషయంలో చట్టం కేవలం శిక్షలకే పరిమితం కాకుండా, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడం, పునరావాసం కల్పించడం, కౌన్సెలింగ్, సరైన మార్గదర్శకత్వం ద్వారా వారిని సత్ప్రవర్తన వైపు నడిపించడమే ప్రధాన లక్ష్యంగా జువైనెల్ జస్టిస్ బోర్డు(జేజేబీ) పనిచేస్తుందన్నారు. జేజేబీ సభ్యులు రమణ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి స్రవంతి, లీగల్ ఎయిడ్ క్లినిక్ కౌన్సిల్ గంగరాజు, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ రామేశ్వర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
బిచ్కుంద: బిచ్కుంద పట్టణానికి ఈనెల 16 ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్నారని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు తెలిపారు. శుక్రవారం ఆయన బిచ్కుందలో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 22న తన కూతురు వివాహం ఉందని, 16న బిచ్కుందలోని డీబీఎల్ కందర్‌పల్లి రోడ్‌లో నిర్వహించే విందులో సీఎం పాల్గొంటారని తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు విఠల్‌రెడ్డి, నాగ్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: మహిళలు తమ వ్యాపారాల్లో నాణ్యత, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని డీఆర్‌డీవో దామోదర్‌రెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం డే–ఎన్‌ఆర్‌ఎల్‌ఎం, సెర్ప్‌ల ఆధ్వర్యంలో ఇంక్యుబేటర్లపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణప్రాంత మహిళా వ్యా పారవేత్తలను ప్రోత్సహించడం, సాంకేతిక పరిజ్ఞానం, మార్గదర్శకత్వం, మార్కెటింగ్, ఆర్థిక సహకారం అందించడమే ఇంక్యుబేటర్ ఉద్దేశమన్నారు. అర్హత కలిగిన మహిళా వ్యాపారవేత్తలను గుర్తించి మార్గదర్శకత్వం అందించాలని ఏపీఎం, సీసీలకు సూచించారు. అడిషనల్ డీఆర్‌డీవో విజయలక్ష్మి, డీపీఏం సాయిలు, ఏపీఎం రాజేందర్ పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో ఈనెల 24న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు తెలిపారు. శుక్రవారం ఆయన పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాబ్‌మేళా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పదేళ్లుగా జాబ్‌మేళాలను నిర్వహిస్తూ ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామన్నారు. 24న నిర్వహించే మేళాలో 70 ఇంటర్నేషనల్ కంపెనీలు పాల్గొంటాయని, సుమారు 5వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ పూర్తి చేసిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
తాడ్వాయి: రైతులు రసాయన ఎరువులకు స్వస్తిచెప్పి, సహజ వ్యవసాయంపై దృష్టిపెట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్‌రెడ్డి సూచించారు. కరడ్‌పల్లి శివారులో సహజ వ్యవసాయంతో సాగుచేసిన పలువురు రైతుల పొలాలను శుక్రవారం ఆయన సందర్శించారు. రైతులకు పలు సూచనలిచ్చారు. అనంతరం ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద పంపిణీ చేసిన మినుము, కందికి సంబంధించిన మినీకిట్ ప్రదర్శన క్షేత్రాలను సందర్శించారు. పుష్పించే దశలో ఉన్న పంటలలో పురుగుల నివారణకు సహజ వ్యవసాయంలో ఉపయోగించే బ్రహ్మాస్త్రంను పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. ఏవో నర్సింలు, ఏఈవో రాకేష్, రైతులు పాల్గొన్నారు.


