కామారెడ్డి క్రైం: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం వల్ల వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎల్‌నినో నేపథ్యంలో పంట మార్పిడి, మండల ప్రజావాణి నిర్వహణ తదితర అంశాలపై సూచనలిచ్చారు. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయన్నారు. దీనిని ఎదుర్కొనేందుకు రైతులు పంట మార్పిడి పద్ధతి పాటించేలా చూడాలన్నారు. అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
సకాలంలో పరిహారం అందించాలి
కామారెడ్డి క్రైం: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు నిబంధనల ప్రకారం సకాలంలో పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు, అట్రాసిటీ కేసుల నమోదు, దర్యాప్తు, బాధితులకు అందుతున్న పరిహారం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతినెలా సివిల్ రైట్స్‌డే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, జెడ్పీ సీఈవో చందర్ నాయక్, డీఎస్పీలు మధుసూదన్, శ్రీనివాస్‌రావు, విఠల్‌రెడ్డి, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
17 నుంచి మండలస్థాయి ప్రజావాణి
కామారెడ్డి క్రైం: ప్రజల సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు ఈ నెల 17 నుంచి ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదన్నారు. సమస్యలపై ప్రతి సోమవారం ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిలో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిశీలించి, పరిష్కరించాలని ఆదేశించారు. తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి తదితరులు పాల్గొన్నారు.


