దోమకొండ : ఫిర్యాదుదారులతో మర్యాదగా, బాధ్యతయుతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. మంగళవారం దోమకొండ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పరిశుభ్రతను పాటించాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌లోని రిసెప్షన్, రికార్డు గదులు, రైటర్ రూమ్ తదితర విభాగాలను పరిశీలించి, కేసులకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కేసుల నమోదు, దర్యాప్తు, రికార్డుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. నేరాల నియంత్రణకు పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో గస్తీ, బీట్‌లు, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని సూచించారు. రౌడీషీటర్ల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. డయల్ 112 ద్వారా వచ్చే అత్యవసర సమాచారంపై వెంటనే స్పందించి, ఆపదలో ఉన్న ప్రజలకు తక్షణ సహాయం అందించాలని సూచించారు. భిక్కనూరు సీఐ నరేష్, ఎస్‌ఐ ప్రభాకర్, ఏఎస్‌ఐ శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.
పేకాట స్థావరంపై దాడి ...
దోమకొండ మండల కేంద్రంలోని గుండ్ల చెరువు సమీపంలో పేకాట స్థావరంపై మంగళవారం పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఎస్‌ఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో పేకాట స్థావరంపై దాడిచేసి ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.28 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సందర్బంగా ఎస్పీ రాజేశ్ చంద్ర మాట్లాడారు. జూదానికి బానిసై విలువైన సమయం, డబ్బును కోల్పోవడంతో పాటు తమ కుటుంబాల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.
పాత పోలీస్‌స్టేషన్ భవనాన్ని
పంచాయతీకి అప్పగించాలి
దోమకొండ మండల కేంద్రంలోని పాత పోలీస్‌స్టేషన్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని దీనిని గ్రామ పంచాయతీకి అప్పగించాలని పంచాయతీ పాలకవర్గ సభ్యులు మంగళవారం జిల్లా ఎస్పీ రాజేశ్‌చంద్రను కలిసి వినతిపత్రం అందజేశారు. దోమకొండ పోలీస్‌స్టేషన్‌కు సందర్శించిన ఎస్పీ రాజేశ్‌చంద్రను సర్పంచ్ ఐరేని నర్సయ్య, మాజీ జడ్పిటిసి తిర్మల్‌గౌడ్, ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్‌తో పాటు చేనేత సహకార సంఘం అధ్యక్షుడు బత్తిని సిద్దరాములు కలిసి శాలువాతో సన్మానించి వినతిపత్రం అందజేశారు.కార్యక్రమంలో వార్డుసభ్యులు ఉన్నారు.
కేసుల నమోదు, రికార్డుల నిర్వహణ, నవీకరణ సక్రమంగా చేపట్టాలి
నేరాల నియంత్రణకు నిరంతరం గస్తీ, బీట్‌లు, పెట్రోలింగ్ నిర్వహించాలి
ఎస్పీ రాజేశ్ చంద్ర


