సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలపై మరోమారు అసహనం వ్యక్తం చేశారు. సీఎం చెప్పినా బిల్లులు రాకపోవడం, మంత్రులు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ‘కేసీఆర్‌ను మోసం చేసిపోవడం ఇష్టం లేకుండే.. అన్నం పెట్టినోళ్లను మరిచిపోతమా’ అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.
బీర్కూర్ మండల కేంద్రానికి సమీపంలో మంగళవారం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఏడాదిన్నర కాలంలో జరిగిన పరిణామాలను వివరిస్తూ మంత్రుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలోనూ సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించడానికి వెళ్లిన పోచారం నీటిపారుదల శాఖ అధికారితో ఫోన్‌లో మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దల తీరుపై అసహనం వ్యక్తం చేసిన వీడియో సంచలనం కలిగించింది. ఇప్పుడు మరోమారు పోచారం అదే రీతిలో స్పందించారు. ఈ సమ్మేళనంలో పోచారం మాట్లాడిన వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. పెండింగ్ బిల్లుల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి పొంగులేటిలకు బాధ్యత అప్పగించాడని, వారు ఫోన్ చేస్తే స్పందించడం లేదని పేర్కొన్నారు. బిల్లుల విషయమై సీఎంను మరోసారి కలిసి రూపాయి కూడా రాలేదని చెబితే వేం నరేందర్‌రెడ్డికి బాధ్యత అప్పగించి మార్చి లోపు మూడు విడతల్లో బిల్లులు ఇప్పించమన్నాడన్నారు. ఆయన కూడా తెల్లారి నుంచి ఫోన్ లేపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాబై సార్లు ఫోన్ చేసినా ఫలితం లేదన్నారు.
పోచారం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించాయి. కేసీఆర్‌ను మోసం చేసి వెళ్లడం ఇష్టం లేకున్నా, అభివృద్ధి కోసమే కండువా మార్చాల్సి వచ్చిందని పోచారం పేర్కొనడంతో ఆయన దారెటు అన్న చర్చ కూడా మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో పోచారం ఒక్కరే బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బాన్సువాడ కాంగ్రెస్ ఇన్‌చార్జీగా వ్యవహరించిన ఏనుగు రవీందర్‌రెడ్డి పట్టు సాధించే ప్రయత్నం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఐదేళ్లు మంత్రిగా, ఐదేళ్లు స్పీకర్‌గా నియోజక వర్గంలో తిరుగులేని నేతగా ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇబ్బందులు పడ్డారు. అప్పటికే జరిగిన అభివృద్ధి పనులు, డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించిన బిల్లుల కోసం ఇబ్బందులు తలెత్తాయి. స్వయంగా సీఎం ఇంటికి వచ్చి పార్టీలో చేరాలని ఆహ్వానించడంతో పోచారం కండువా కప్పుకున్నారు. అయితే ఆరు నెలల్లో అన్ని జరుగుతాయని ఆశించిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి నిరాశే ఎదురైంది.
కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆయన అంతర్మథనంలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఏళ్లుగా కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో పనులు ఆగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దాపూర్ రిజర్వాయర్, ఆస్ప్రత్రి భవనాల నిర్మాణాలకు సంబంధించి రూ. వందల కోట్లు రావాల్సి ఉంది. ఈ విషయాన్ని పలుమార్లు సీఎంకు చెప్పినా పని జరక్కపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేసీఆర్‌ను మోసం చేసి వెళ్లాలని లేకుండే. అభివృద్ధి కోసం తప్పలేదు’ అన్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లోనూ మన జెండానే గెలుస్తుందన్న ఆయన పేర్కొనడంతో ఏ పార్టీ అన్న చర్చ జరుగుతోంది.
సర్కారు తీరుపై తీవ్ర అసంతృప్తి
సీఎం చెప్పినా బిల్లులు
రాలేదని ఆవేదన
ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో
సంచలనంగా మారిన వ్యాఖ్యలు
అధికార పార్టీ నేతల్లో చర్చ


