ఎన్‌హెచ్‌ 44 | - | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌ 44

Aug 6 2026 2:20 AM | Updated on Aug 6 2026 2:20 AM

నిఘా నీడలో.. ఎన్‌హెచ్‌ 44

నిరంతరం పర్యవేక్షణ..

కాళ్లకల్‌ నుంచి మహారాష్ట్ర సరిహద్దు దాకా...

నిఘా నీడలో..

కిలోమీటర్‌కు ఒకటి చొప్పున బిగింపు

ఇప్పటికే 190 కిలోమీటర్ల వరకు ఏర్పాటు

టోల్‌ప్లాజాల్లో కంట్రోల్‌ రూంలు

నాగ్‌పూర్‌ హైవేపై హై రిజల్యూషన్‌ కెమెరాలు..

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : నాగ్‌పూర్‌ హైవేగా పిలవబడే 44వ నంబరు జాతీయ రహదారిపై నిఘాను మరింత పటిష్టం చేస్తున్నారు. నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) పర్యవేక్షణలో సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వివిధ కార్పొరేట్‌ సంస్థల సహకారంతో ప్రతి కిలోమీటర్‌కు ఒక హై రిజల్యూషన్‌ కెమెరాను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు కిలోమీటర్‌ పొడవునా వాహనాల రాకపోకలను కెమెరాలు పసిగడతాయని ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్‌ నాగేశ్వర్‌రావ్‌ ‘సాక్షి’తో తెలిపారు.

నిరంతర నిఘా వ్యవస్థ...

జాతీయ రహదారిపై 24/7 నిఘా కెమెరాలు పనిచేయనున్నాయి. దీంతో హైవేలపై ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. ఏదైనా వాహనం రోడ్డుపై మరో వాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోతే కంట్రోల్‌ రూంలో స్పష్టంగా కనబడుతుంది. దీంతో ఆ వాహనం తప్పించుకునే అవకాశం ఉండదు.

ఎన్‌హెచ్‌ 44 మీదుగా నిత్యం వేలాది వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. ఎక్కడో చోట ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు దారిదోపిడీలూ జరుగుతాయి. నిరంతర నిఘా వ్యవస్థ మూలంగా దోపిడీలకు కళ్లెం పడుతుందని భావిస్తున్నారు. హైవేపై హైరిజల్యూషన్‌ కెమెరాలు ఏర్పాటు చేయడం మూలంగా వాహన వేగ పరిమితి గంటలకు 80 కిలోమీటర్లు దాటకుండా వాహనదారులు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కెమెరాలు ఉన్న ప్రాంతానికి వెళ్లగానే వాహనదారులు వేగాన్ని తగ్గించి 80 కిలోమీటర్లు దాటకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడు కిలోమీటర్‌కో కెమెరా ఏర్పాటు అవడం, అవి కూడా హైరిజల్యూషన్‌ కెమెరాలు కావడంతో వాహనదారులు పరిమితిని దాటి వేగంగా వెళితే కచ్చితంగా కెమెరా కన్నుకు చిక్కాల్సిందే.

టోల్‌ ప్లాజాల వద్ద కెమెరాల కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేస్తున్నారు. మెదక్‌ జిల్లాలోని మనోహరాబాద్‌, కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు, నిజామాబాద్‌ జిల్లాలోని ఇందల్వాయి, నిర్మల్‌ జిల్లాలో ఒకటి, ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఆయా టోల్‌ప్లాజాలలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంల ద్వారా నిరంతరం పరిశీలిస్తారు. దీంతో ఎక్కడ ఏం జరిగినా వెంటనే అధికారులకు తెలిసిపోతుంది. ఎన్‌హెచ్‌ఏఐ కేవలం రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తుంది. అయితే హైవేపై ప్రమాదాలు, నేరాలు జరిగినపుడు పోలీసు శాఖ హైవే అధికారుల సహకారం తీసుకుని సీసీ పుటేజీలను పరిశీలించడానికి ఆస్కారం ఉంటుంది.

మేడ్చల్‌ సమీపంలోని కాళ్లకల్‌ నుంచి ఆదిలాబాద్‌ జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు వరకు దారి పొడవునా కెమెరాలను అమర్చుతున్నారు. ఇప్పటికే 190 కిలోమీటర్ల మేర కెమెరాలు బిగించారు. రోడ్డుపైకి వచ్చిన ప్రతి వాహనం కదలికలను కెమెరాలు రికార్డు చేస్తాయి. వీటి పనితీరును అధికారులు పరిశీలిస్తున్నారు. మరో 60 కిలోమీటర్ల మేర కెమెరాల ఏర్పాటుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. హైవేపై ఉన్న ఆయా టోల్‌ ప్లాజాల వద్ద కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేస్తున్నారు. హై రిజల్యూషన్‌ కెమెరాలు వాహనాల వేగాన్ని కూడా గమనించి హైవేపై ఏర్పాటు చేసిన స్క్రీన్‌ల మీద వాహనం వేగాన్ని వెల్లడిస్తాయి. కాగా కెమెరాలన్నీ శాటిలైట్‌ ద్వారానే కంట్రోల్‌ రూంతో కనెక్ట్‌ అయి ఉంటాయి. ఎక్కడా వైర్లు, కేబుళ్లు ఉండవు. దీంతో ఎలాంటి ఆటంకాలకు ఆస్కారం లేకుండా కెమెరాలు నిరంతరం పనిచేస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement