● గడువులోగా భూ భారతి
రీ సర్వే పూర్తి చేయాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
గాంధారి: వీబీ జీ రామ్‌జీ కింద ఫాంపాండ్‌ల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బుధవారం ఆయన గాంధారి మండలంలో పర్యటించారు. పోతంగల్ ఖుర్దులో వీబీ జీ రామ్‌జీ పథకం కింద చేపట్టిన ఫాంపాండ్, కొబ్బరి బండ్ ప్లాంటేషన్ పనులను పరిశీలించారు. సంబంధిత రైతులతో మాట్లాడారు. చేపల పెంపకం ద్వారా ఏటా రూ. 1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు అదనపు ఆదాయం పొందుతున్నామని రైతు వివరించారు. ఫాంపాండ్‌లో నిల్వ ఉన్న నీటిని వినియోగించడం వల్ల పంటలకు యూరియా వినియోగం గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. అనంతరం సీతాయిపల్లిలో కొనసాగుతున్న భూ భారతి రీ సర్వే పనులను పరిశీలించారు. ఇప్పటివరకు 11.5 కిలోమీటర్ల బౌండరీని ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు. రీసర్వే పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఐకేపీ కార్యాలయంలో విద్యార్థుల యూనిఫాం స్టిచ్చింగ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్, డీఆర్‌డీవో దామోదర్‌రెడ్డి, ఎంపీడీవో రాజేశ్వర్, తహసీల్దార్ రేణుకా చౌహాన్, ఏపీఎం ప్రసన్న కుమార్, ఏపీవో మధు, సర్పంచ్‌లు సంతోష్, అంజద్ తదితరులు పాల్గొన్నారు.


