● 11 రాష్ట్రాలలో నేర చరిత్ర
● కామారెడ్డి పోలీసులకు చిక్కిన
అంతర్రాష్ట్ర దొంగల ముఠా
● వివరాలు తెలిపిన ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి క్రైం: కామారెడ్డి పోలీసులు ఐదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. వీరు 11 రాష్ట్రాల్లో 80 నేరాలకు పాల్పడ్డారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కామారెడ్డి పట్టణంలోని జయశంకర్ కాలనీకి చెందిన అజ్జన్ నిరేష్ మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కామారెడ్డి టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. బుధవారం వేకువజామున కామారెడ్డి రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా కనిపించిన ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వేలిముద్రలను పరిశీలించారు. నిందితులను మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా కాంప్టీ గ్రామానికి చెందిన మహమ్మద్ అలీ రజాక్, మహమ్మద్ నాసిర్, మహమ్మద్ సాదిక్, మహమ్మద్ షాహిద్ రజాక్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన షేక్ ఫైజాన్‌లుగా గుర్తించారు. వారందరికీ నేరచరిత్ర ఉన్నట్లు గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా ఈ ముఠా నేర చరిత్ర బయటపడింది.
రద్దీ ప్రాంతాలే టార్గెట్‌గా..
నిందితులు ఒక అంతర్రాష్ట్ర ముఠాగా ఏర్పడి వివిధ రాష్ట్రాల్లో సంచరిస్తూ బ్యాంకులు, ఏటీఎంలు, మార్కెట్లు, బస్టాండ్లు వంటి రద్దీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. ప్రజల దృష్టిని మరల్చేందుకు హాత్ సఫాయి, బాబాగిరి, నకిలీ నోట్ల తనిఖీ పేరుతో నగదు, బంగారు ఆభరణాలను అపహరించడం వీరి పద్ధతి. రాత్రి సమయాలలో ఇళ్లలో చోరీలకు పాల్పడతారు. కత్తులతో బెదిరించి దారి దోపిడీలకూ పాల్పడతారని విచారణలో వెల్లడైంది.
వరుస నేరాలు..
నిందితులు గతనెల 27 న మహారాష్ట్ర నుంచి కామారెడ్డికి చేరుకున్నారు. 28 న పట్టణంలోని మున్సిపల్ సమీపంలో ఉన్న ఎస్బీఐ ఇందిరానగర్ బ్రాంచ్‌లో నుంచి నగదు డ్రా చేసుకున్న ఓ వ్యక్తి వద్ద నుంచి నోట్లు లెక్కించేందుకు సహాయం చేసే పేరుతో (హాత్ సఫాయి పద్ధతిలో) రూ. 15 వేలు అపహరించారు. అనంతరం మహారాష్ట్రకు వెళ్లి బల్లార్షా గ్రామంలో మరో వ్యక్తి వద్ద నుంచి నగదు దోపిడీ చేశారు. మళ్లీ తెలంగాణలో నేరాలు చేసేందుకు వచ్చారు. ఈనెల 3 న నిజామాబాద్‌లో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తిని కత్తులతో బెదిరించి నగదు దోచుకున్నారు. 4 న రాత్రి కామారెడ్డి జయశంకర్ కాలనీలోని ఇంట్లో చోరీకి పాల్పడ్డారు.
తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో సుమారు 80 నేరాలకు పాల్పడ్డారు. ఈ ముఠా ఒక్క బెంగళూరులోనే 50 కి పైగా నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. మహారాష్ట్రలోని బల్లార్షా, చంద్రపూర్‌తోపాటు హైదరాబాద్‌లోని నారాయణగూడ, చార్మినార్, మార్కెట్, ఉప్పల్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయని ఎస్పీ తెలిపారు. నిందితుల వద్దనుంచి రూ.4 వేలు నగదు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకోవడంలో విశేషంగా కృషి చేసిన కామారెడ్డి పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి, ఎస్సైలు సాయికృష్ణ, భువనేశ్వర్, సిబ్బంది రాజు, సంపత్, సీసీఎస్ సీఐ రామన్, సిబ్బంది స్వామి, కిషన్ లను అభినందించారు. సమావేశంలో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ పాల్గొన్నారు.


