వాహన దొంగల ముఠా గుట్టురట్టు | - | Sakshi
Sakshi News home page

వాహన దొంగల ముఠా గుట్టురట్టు

Jul 27 2026 1:48 AM | Updated on Jul 27 2026 1:48 AM

పది మంది అరెస్ట్‌.. ఆరుగురు పరారీ

రూ.17 లక్షల విలువైన

వాహనాలు స్వాధీనం

ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో కొద్ది నెలలుగా వాహన చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠా గుట్టును రట్టు చేసినట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. మొత్తం 16 మంది నిందితులపై కేసు నమోదు చేసి, పది మందిని అరెస్ట్‌ చేయగా, ఆరుగురు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 21న రిమ్స్‌ ఎదురుగా పలువురు ఆటో దొంగతనానికి యత్నించిన అనంతరం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. 24న కుప్టి ఘాట్‌ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో నిందితులు పోలీసులపై కత్తితో బెదిరింపులకు పాల్పడి కారులో పరారయ్యారు. 25న వాంకిడి చెక్‌పోస్ట్‌ వద్ద నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు అదే కారును గుర్తించి ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రధాన నిందితులు యాసర్‌ అహ్మద్‌, సోహైల్‌ వాహన డ్రైవర్లుగా పనిచేస్తూ దొంగతనానికి అనువైన వాహనాలను గుర్తించి ముఠా సభ్యులకు సమాచారం అందించేవారు. అనంతరం సభ్యులు కారును అద్దెకు తీసుకుని పార్కింగ్‌లో ఉన్న వాహనాలను దొంగిలించి ఇఫ్తేఖార్‌, షేక్‌ అబూతలాహకు విక్రయించేవారు. అరెస్టు చేసిన పది మంది నిందితుల నుంచి 7 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, ఒక కారు, 8 మొబైల్‌ ఫోన్లు, ఒక కత్తి, రూ.1,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ సుమారు రూ.17లక్షలు ఉంటుందని ఎస్పీ వివరించారు. పరారీలో ఉన్న మరో ఆరుగురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉట్నూర్‌ ఏఎస్పీ రుత్విక్‌ సాయి కొట్టే, ఇచ్చోడ సీఐ సీహెచ్‌ రమేశ్‌, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌, నేరడిగొండ ఎస్సై సయ్యద్‌ ఇమ్రాన్‌ తదితరులు పాల్గొన్నారు.

నిందితుల వివరాలు..

నిర్మల్‌లోని రామ్‌నగర్‌కు చెందిన యాసర్‌ అహ్మద్‌, సోఫీనగర్‌కు చెందిన అక్బర్‌ఖాన్‌, మహ్మద్‌ అద్నా న్‌, ఆజామ్‌ ఖాన్‌, ఉమర్‌ ఖాన్‌, గుల్జార్‌ మార్కెట్‌ కు చెందిన అబ్దుల్‌ ఫారూక్‌, బుధవార్‌పేట్‌కు చెందిన అర్బాస్‌ ఖాన్‌, ఆదర్శ్‌నగర్‌కు చెందిన నాసిర్‌ బిన్‌ జావీద్‌, షేక్‌ అబూతలాహ, మదీనా కాలనీకి చెందిన షేక్‌ ఇఫ్తేఖార్‌లను అరెస్టు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిర్మల్‌కు చెందిన ఇమ్రాన్‌, నిజామాబాద్‌కు చెందిన జైన్‌, ఆదర్శ్‌నగర్‌కు చెందిన జునైద్‌, బుధవార్‌పేట్‌కు చెందిన సోఫియాన్‌, ఫర్దీన్‌, అద్నాన్‌లు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement