మెలకువలు అందిస్తున్నాం
● ఏడాది పొడవునా ఒకే రకమైన
పంటతో నష్టాలు
● తగ్గనున్న రసాయన ఎరువుల వాడకం
● పెరగనున్న నీటి నిల్వ సామర్థ్యం
మద్నూర్(జుక్కల్): ప్రస్తుత సాగు సీజన్‌లో రైతులు సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి తప్పనిసరిగా పంట మార్పిడి విధానాన్ని అమలు చేయాలని వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఏటా ఒకే రకమైన పంటలను పండించడం వల్ల భూసారం క్షీణించడమే కాకుండా తెగుళ్లు, పురుగుల ఉధృతి కూడా పెరిగి పంట దిగుబడులు పూర్తిగా తగ్గి రైతులకు నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు.
నేల ఆరోగ్యం.. అధిక దిగుబడి
పంట మార్పిడి విధానం ద్వారా భూమికి సహజ సిద్ధమైన పోషకాలు అందుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా వరి, పత్తి వంటి ఎక్కువ నీరు, పెట్టుబడి అవసరమయ్యే పంటల తర్వాత మినుము, పెసర, వేరుశనగ, కంది వంటి పప్పుధాన్యాల పంటలను సాగు చేయడం వల్ల గాలిలోని నత్రజని నేలలో స్థిరపడుతుందని వివరించారు. ఇది తర్వాతి పంటలకు అద్భుతమైన బలాన్ని ఇస్తుందన్నారు.
ఇవీ సూచనలు..
జొన్న పంట సాగు చేసిన పొలంలో మిరప పంట సాగుచేయరాదు. వేరుశనగ పంటను సాగు చేసిన తర్వాత పంటపై మళ్లీ అదే పంటను సాగు చెయ్యొద్దని, తద్వారా పంటపై ఎర్రగొంగళి పురుగు, శనగపచ్చ పురుగులు ఆశిస్తాయి. నులిపురుగులు ఉన్న ప్రాంతాల్లో టమాటా, వంకాయ, బెండ, మిరప వంటి కూరగాయలను వరుసగా వేయకూడదు. వాటి స్థానంలో నులిపురుగులు ఆశించని లేదా తట్టుకునే పంటలతో మార్పిడి చేయాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
పంట మార్పిడిలో నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పే పంటలైన వేరుశనగ, బొబ్బెర, పెసర, మినుము పంటలను వేయడం వల్ల నేలను పూర్తిగా కప్పి ఉంచడంతో కలుపు మొక్కలను నివారించవచ్చు.
పప్పు దినుసుల పంటలను వేయడం వల్ల రైజోబియం బుడిపెలు ఏర్పడటంతో ఇవి గాలిలోని నత్రజనిని భూమిలో స్థిరీకరించి నేలను సారవంతంగా చేస్తాయి. ఈ పప్పు దినుసుల పంటలను పచ్చిరొట్ట ఎరువుగా కూడా వాడుకోవచ్చు. పత్తి పంటను మినుము, పెసర వంటి పంటలతో మార్పిడి చేసుకోవటం ద్వారా తెల్లదోమ ఉధృతిని తగ్గించుకోవచ్చు. అలాగే వేరుశనగ తర్వాత జొన్న, మొక్కజొన్న వంటి ఆరుతడి పంటలను పండించాలి. దీంతో వేరుశనగ పంటను ఆశించే ఆకుముడత తెగుళ్ల ఉధృతిని తగ్గించవచ్చు. వరిపంట తర్వాత పప్పు ధాన్యాల పంటలను కానీ, నూనె గింజల పంటలను కాని పండించటం వల్ల వరి పంటను ఆశించే వైరస్, దోమపోటులను నివారించవచ్చు.
భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ చేసే శక్తి ఉన్నప్పుడు పంట తర్వాత వేరే పంటను వేసి ఏడాదిలో రెండు పంటలను పండించుకోవాలి. తేలికపాటి నేలలు, ఎర్ర ఇసుక నేలల్లో మిశ్రమ పంటలను సాగుచేసుకోవాలని, వర్షాకాలం రోజులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పంట కాలం గల కంది, వేరుశనగ వంటి పంటలను సాగు చేసుకుంటే మంచిది.
–రాజు, ఏవో, మద్నూర్


