ఆశలకు బీటలు | - | Sakshi
Sakshi News home page

ఆశలకు బీటలు

Jul 17 2026 1:22 AM | Updated on Jul 17 2026 1:22 AM

ఆశలకు బీటలు పావుశాతమే..

35 శాతం లోటు వర్షపాతం..

ముఖం చాటేసిన వరుణుడు

ముందుకు సాగని వరి నాట్లు

దెబ్బతింటున్న ఆరుతడి పంటలు

దిక్కులు చూస్తున్న రైతులు

సంగోజీవాడి శివారులో బోరులో

మోటారు బిగిస్తున్న రైతులు

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: జిల్లాలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. వానాకాలం సీజన్‌ మొదలై నెలన్నర గడచినా వానల జాడ లేకపోవడంతో ఆశలు ఆవిరవుతున్నాయి. అప్పుడప్పుడు కురిసిన జల్లులతో మక్క, పత్తి, సోయా, పప్పుదినుసులు వేసిన రైతులు.. కళ్ల ముందే పంట వాడిపోతుంటే తల్లడిల్లుతున్నారు. బోర్లమీద ఆధారపడి అక్కడక్కడా నాట్లు వేసిన రైతులు.. ఊటలు తగ్గి బోర్లు ఎత్తిపోతుండడంతో నీరందక బీటలు వారుతున్న మడులను చూసి కన్నీటిపర్యంతమవుతున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో పంటల పరిస్థితిపై ‘సాక్షి’ గురువారం క్షేత్ర స్థాయి పరిశీలన చేసింది. అంతటా దుర్భిక్ష పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకో వారం రోజులు వర్షాలు కురవకుంటే మెట్ట పంటలు పూర్తి స్థాయిలో చేజారే అవకాశాలున్నాయి.

జిల్లాలో పంటల సాగు ఇలా..

వానాకాలం సీజన్‌లో 5.59 లక్షల ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కాగా ఇప్పటి వరకు 2.78 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 77,790 ఎకరాాలలో, సోయా 75,524 ఎకరాలలో, మక్క 40,943 ఎకరాలలో, కంది 42,027 ఎకరాలలో, పత్తి 39,762 ఎకరాలలో, పెసర 1,374 ఎకరాలలో, మినుము 1,166 ఎకరాలలో, చెరుకు 245 ఎకరాలలో, సన్‌ఫ్లవర్‌ 35 ఎకరాల్లో సాగయ్యాయి. మెట్ట ప్రాంతాల్లో వర్షాలపై ఆధారపడి సాగు చేస్తున్న మక్క, పత్తి, సోయా, కంది తదితర ఆరుతడి పంటల పరిస్థితి దారుణంగా తయారైంది. సరైన వర్షాలు లేకపోవడంతో పంటలు వాడిపోతున్నాయి. తాడ్వాయి, రాజంపేట, గాంధారి, సదాశివనగర్‌, రామారెడ్డి, దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, లింగంపేట, పిట్లం, పెద్దకొడప్‌గల్‌, మద్నూర్‌, బిచ్కుంద, జుక్కల్‌ తదితర మండలాల్లో ఆరుతడి పంటలు దెబ్బతింటున్నాయి. కొన్నిచోట్ల రైతులు స్ప్రింక్లర్లు, డ్రిప్‌ ద్వారా నీరందించి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

జిల్లాలో 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారులు అంచనా వేయగా.. ఇప్పటివరకు 77,790 ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. చాలా మంది రైతులు నార్లు పోసి ఉన్నారు. వర్షాలు కురిస్తే వర్షపు నీటితో కలుపుకుని పొలాలను సిద్ధం చేసేవారు. కానీ వర్షాలే లేకపోవడంతో నాట్లు వేయలేని పరిస్థితి నెలకొంది. నిజాంసాగర్‌ ఆయకట్టు కింద బాన్సువాడ, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ మండలాల పరిధిలో దాదాపు 30 వేల ఎకరాల్లో నాట్లు వేశారు. లింగంపేట, నాగిరెడ్డిపేట మండలాల్లో బోర్లపై ఆధారపడి 23 వేల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. మిగతా మండలాల్లో రెండు వేల నుంచి నాలుగు వేల ఎకరాలలోపు నాట్లు వేశారు.

జిల్లాలో పక్షం రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురవగా, చాలా ప్రాంతాల్లో చినుకు జాడ లేదు. సీజన్‌ మొదలైన నాటి నుంచి గురువారం నాటికి (నెలన్నర రోజులు) జిల్లాలో సాధారణ వర్షపాతం 265.1 మి.మీ. కాగా.. 172.8 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. 35 శాతం లోటు ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో 25 మండలాలు ఉండగా.. 20 మండలాల్లో లోటు వర్షపాతం రికార్డయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement