● రాజీనామా చేసిన రిజిస్ట్రార్ యాదగిరి
● బుజ్జగించిన
వీసీ యాదగిరిరావు
● యథావిధిగా విధుల్లో కొనసాగింపు
తెయూ(డిచ్‌పల్లి) : తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి తన పదవికి రాజీనామా చేసిన వ్యవహారంతో క్యాంపస్‌లో హైడ్రామా నెలకొంది. రాజీనామాను వీసీ యాదగిరిరావు తిరస్కరించడంతో కథ సుఖాంతమైంది.
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య బుధవారం యూనివర్సిటీని సందర్శించిన సమయంలో ఆయన ఎదుటే కొందరు ఇంకెన్నాళ్లు రిజి స్ట్రార్‌గా కొనసాగుతారని యాదగిరిని ప్రశ్నించారు. అడగకుండానే వచ్చి కుర్చీలో కూర్చున్నావా అంటూ ప్రొఫెసర్ కనకయ్య నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మనస్తాపం చెందిన యాదగిరి తన రాజీనామా లేఖను వీసీ పీఏకు అందించారు.
రాజీనామా తిరస్కరణ..
గురువారం ఉదయం వర్సిటీకి వచ్చిన వీసీ యాదగిరిరావు చేతికి రిజిస్ట్రార్ రాజీనామా లేఖ అందింది. వెంటనే ఆయన యాదగిరికి ఫోన్ చేసి తన చాంబర్‌కు పిలిపించుకున్నారు. రాజీనామాను తాను ఆమోదించడం లేదని రిజిస్ట్రార్‌గా కొనసాగాలని బుజ్జగించారు. వర్సిటీ అభివృద్ధి కోసం, పరిపాలన పారదర్శకంగా, సాఫీగా సాగడానికి మీ సేవలు అవసరమని కోరారు. దీంతో యాదగిరి తన రాజీనామాను ఉపసంహరించుకుని మధ్యాహ్నం నుంచి విధుల్లో కొనసాగారు.
వర్సిటీ వర్గాల్లో అసంతృప్తి..
2024 జూన్ 16 నుంచి రిజిస్ట్రార్‌గా యాదగిరి కొనసాగుతున్నారు. పదవీ కాలం ముగిసినా ఆయననే వీసీ కొనసాగింపజేస్తున్నారు. ఈ విషయంలో పలువురు అధ్యాపకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆయన పదవి నుంచి తప్పుకుంటే తమలో ఒకరికి రిజిస్ట్రార్‌గా అవకాశం వస్తుందని చాలా కాలంగా ఆశావహులు ఎదురు చూస్తున్నారు. పరిపాలనా సామర్థ్యం యాదగిరికే ఉందని నమ్ముతున్న వీసీ.. ఆయననే కొనసాగింపజేయడం ఆశావహులను మరింత అసహనానికి గురిచేస్తోంది. ప్రస్తుత రిజిస్ట్రార్‌ను తొలగించి వర్సిటీలోని సీనియర్ అధ్యాపకులలో ఒకరికి పదవి కట్టబెట్టాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది.


