కామారెడ్డి టౌన్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలని ఎస్పీ రాజేశ్ చంద్ర పోలీసులకు సూచించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలోని పోలీస్ స్టేషన్ల కార్యాలయాల రైటర్లకు సీసీటీఎన్‌ఎస్–2.0, ఇతర ఆధునిక పోలీసింగ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా చూడడంలో రైటర్ల పాత్ర అత్యంత కీలకమన్నారు. కేసుల దర్యాప్తు, పరిశోధనలో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి చార్జ్‌షీట్ దాఖలు చేసే వరకు ప్రతి వివరాన్ని సమగ్రంగా, స్పష్టంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. సీసీటీఎన్‌ఎస్–2.0తో పాటు పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, టీఎస్–కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ–సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్ పోర్టల్, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ వంటి ఆధునిక సాఫ్ట్‌వేర్లపై సిబ్బంది పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా దర్యాప్తులో నాణ్యత పెరిగి, ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం మరింత బలపడుతుందన్నారు. బాధితుడికి సమయానికి న్యాయం అందించడమే ప్రతి పోలీసు అధికారి ప్రధాన బాధ్యత కావాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో పోలీసులు, అధికారులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల రైటర్లు పాల్గొన్నారు.


