కామారెడ్డి టౌన్ : ఖైదీలు పరివర్తన చెంది, జైలు శిక్ష పూర్తి చేసుకున్న అనంతరం సమాజంలో సన్మార్గంలో నడవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి నాగరాణి సూచించారు. గురువారం ఆమె జిల్లా కేంద్రంలోని జిల్లా సబ్ జైలును సందర్శించారు. ఈ సందర్భంగా జైలులో ఖైదీలకు అందుతున్న ఉచిత న్యాయ సహాయ సేవలు, లీగల్ ఎయిడ్ క్లినిక్ పనితీరు, ఖైదీలకు కల్పిస్తున్న సంక్షేమ సదుపాయాలను పరిశీలించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను, కేసుల పురోగతిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేద, అర్హులైన ఖైదీలకు న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉంటుందన్నారు. బెయిల్, అప్పీలు దాఖలు చేయడం, లోక్ అదాలత్ ద్వారా వివాదాల పరిష్కారం వంటి అంశాలపై ఖైదీలకు అవగాహన కల్పించారు. సాంఘిక, కుల బహిష్కరణ వంటి చట్టవిరుద్ధ చర్యలు, దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడడం వల్ల కలిగే చట్టపరమైన పరిణామాలను ఖైదీలకు వివరించారు. సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపడానికి చట్టాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. జైలులోని వంటగది, పరిసరాలు, తాగునీటి సదుపాయాలను పరిశీలించారు. జైలులోని ఫిర్యాదు పెట్టెను తనిఖీ చేసి, ఖైదీల సంక్షేమం కోసం నిరంతరం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జైలు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మాయా సురేష్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శ్రీనివాస్‌రావు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విఠల్‌రావు, జైలు సూపరింటెండెంట్ సంజీవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


