గందరగోళం
బిచ్కుంద : మున్సిపల్ ఓటర్ల ముసాయిదా జాబితా తప్పుల తడకగా ఉండడం, కొందరి పేర్లు జాబితాలో లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మేజర్ పంచాయతీ అయిన బిచ్కుంద ఏడాది క్రితం మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. దీని పరిధిలో బిచ్కుంద, గోపన్‌పల్లి, కందర్‌పల్లి, దౌల్తాపూర్ గ్రామాలున్నాయి. ఈనెల 1న అధికారులు ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించారు. 12 వార్డుల పరిధిలో 12,759 ఓట్లున్నాయి. అయితే వార్డులవారీగా రూపొందించిన జాబితాలో తమ పేర్లు కనిపించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన పలువురి ఓట్లు గల్లంతయ్యాయంటున్నారు. చాలామంది పేర్లు ఓటర్ల జాబితాలో కనబడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. బల్దియా కార్యాలయానికి వచ్చి ఓటరు లిస్టును పరిశీలిస్తున్నారు. చదువు రానివారు ఫొటోలను చూసుకుంటున్నారు. స్పష్టంగా ముఖం కనిపించకపోవడంతో పోల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయంలో వివరాలు చెప్పేవారు లేరని, ఐదు రోజులనుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఒక బీఎల్‌వోను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.
రెండే ఫిర్యాదులు..
ఓటరు జాబితాపై ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే బల్దియా పరిధిలో చాలామంది నిరక్షరాస్యులు ఉండడం, అవగాహన లేకపోవడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. కేవలం రెండు దరఖాస్తులే రావడం దీనికి నిదర్శనం. ఒక వార్డులో భార్య పేరు మరో వార్డులో భర్త పేరు ఉందని, ఇద్దరి ఓట్లకు ఒకే వార్డులోకి మార్చాలని రెండు దరఖాస్తులు వచ్చాయి.
● వార్డు లిస్ట్‌లో తమ పేరు లేదంటున్న
పలువురు
● ఓటు హక్కు కల్పించాలని వినతి


