ఓటర్ల జాబితా తప్పుల తడక
ముసాయిదాపై రాజకీయనేతల ఆగ్రహం ● రసాభాసగా ముగిసిన సమావేశం
కామారెడ్డి టౌన్ : ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆరోపించారు. సోమవారం మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి తన చాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముసాయిదా జాబితాలో భారీగా తప్పులు దొర్లాయని నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా వార్డుల విభజన, ఓటర్ల కేటాయింపులో తీవ్ర గందరగోళం నెలకొందంటూ మండిపడ్డారు. కొన్ని వార్డుల్లో ఫేక్ ఓటర్లు ఉన్నారని, చనిపోయిన వారి పేర్లు ఇంకా జాబితాలోనే ఉన్నాయని పేర్కొన్నారు. కొందరు ఓటర్ల పేర్లు పక్క వార్డుల్లోకి మారాయని, పోలింగ్ స్టేషన్ల కేటాయింపు కూడా అస్తవ్యస్తంగా ఉందని ధ్వజమెత్తారు. ఇవి పోలింగ్, వార్డుల రిజర్వేషన్ల కేటాయింపు, ఫలితాలపై ప్రభావం చూపవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వీటిని వెంటనే సరిచేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కమిషనర్ స్పందించారు. ఈనెల 8వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని, ఎలాంటి తప్పులు లేకుండా తుది జాబితాను ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
తప్పుడు సమాచారంతో..
మున్సిపల్ ముసాయిదా ఓటరు జాబితాపై నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. నిబంధనల ప్రకారం ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నాయకులను మాత్రమే ఆహ్వానించాల్సి ఉండగా.. ఓ అధికారి తప్పిదంతో సమాచారం అందరికీ వెళ్లింది. ఎవరైనా సరే అందరూ రావాలని ఇచ్చిన సమాచారంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ సహా ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కమిషనర్ చాంబర్ కిక్కిరిసిపోవడంతో కొందరు ముఖ్య నాయకులకు కూర్చోవడానికి కుర్చీలు కూడా లేక అసహనంతో బయటకు వెళ్లిపోయారు. దీంతో కమిషనర్ రాజేందర్‌రెడ్డి సదరు అధికారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, టీజేఎస్ తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు.


