ఆ పదిహేడు మందిలో స్వామి!
సాక్షి ప్రతినిధి, కామా రెడ్డి : సీపీఐ మావోయిస్టు పార్టీలో రా ష్ట్రం నుంచి 17 మంది మాత్రమే ఉన్నా రంటూ పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించిన జాబితాలో జిల్లాకు చెందిన లోకేటి చందర్ అలియాస్ స్వామి అలియాస్ ప్రభాకర్ ఉన్నారు. ఆయనపై రూ.25 లక్షల రివార్డు ఉంది.
ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన లోకేటి చందర్ మూడున్నర దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఉమ్మడి జిల్లాలో దళ కమాండర్‌గా, జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత ఆయనను దండకారణ్యానికి పంపించారు. రెండు దశాబ్దాలుగా అక్కడే పనిచేస్తున్నారు. స్వామి భార్య సులోచన కూడా భర్తతో కలిసి అడవిబాట పట్టింది. 2009 లో కొడుకు రమేశ్, కూతురు లావణ్య కూడా పార్టీలో చేరారు. ఎనిమిదేళ్ల క్రితం స్వామి భార్య సులోచన అనారోగ్యంతో దండకారణ్యంలోనే చనిపోయింది. స్వామి కొడుకు రమేశ్ ఇటీవలే లొంగిపోయాడు. కూతురు లావణ్య చత్తీస్‌ఘడ్‌లో అరెస్టయ్యింది. ఉమ్మడి జిల్లా నుంచి కీలక నేతగా ఎదిగిన లోకేటి చందర్ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్‌గా అలాగే వెస్ట్ జోనల్ బ్యూరో సెక్రెటరీగా పనిచేస్తున్నట్టు పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం ఆయనను లొంగిపోవాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో చందర్ అలియాస్ స్వామి దారి ఎటు అన్నదానిపై జిల్లాలో చర్చ నడుస్తోంది. లొంగిపోతాడా లేక అజ్ఞాతంలోనే కొనసాగుతాడా అన్న అంశంపై ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఆ పదిహేడు మందిలో స్వామి!


